గుండె తరుక్కుపోతోంది.. ఆప్ఘన్‌లో పరిస్థితిపై రాములమ్మ విజయశాంతి
తాలిబాన్ల ఏలుబడిలోకి ఆప్ఘనిస్థాన్ వచ్చేసింది. అక్కడ ఉన్న వారి పరిస్థితి దయనీయంగా మారింది. ఒక్కొక్కరు తమ బాధను వెల్లబోసుకుంటున్నారు. అయితే ఆప్ఘనిస్థాన్ పరిస్థితులను చూస్తే గుండె చెరువైపోతోందని బీజేపీ నేత విజయశాంతి అభిప్రాయపడ్డారు. మహిళలను లైంగిక బానిసలుగా మలచిన ఆ రోజులు మళ్లీ వచ్చాయన్నారు. తాలిబన్ సర్కారును పాకిస్తాన్ కీర్తించడంలో పెద్దగా ఆశ్చర్యమేమీ లేదు.. కానీ కమ్యూనిస్ట్ దేశాలు రష్యా, చైనాలు వంతపాడటమే దౌర్భాగ్యం అన్నారు.

పీడకలే
ఆప్ఘనిస్థాన్ పరిస్థితుల్ని చూస్తే గుండె చెరువైపోతోందని విజయశాంతి అన్నారు. 1996 నుంచి 2001 వరకూ అక్కడ జరిగిన పరిణామాల జ్ఞాపకాలు నేటికీ పీడకలలా వెంటాడుతూ స్మృతి పథం నుంచి చెరిగిపోకముందే మళ్ళీ నరరూప రాక్షసులైన తాలిబన్ల ఆటవికపాలన మొదలైందన్నారు. మహిళలను లైంగిక బానిసలుగా చేసి, పిల్లలను కనే యంత్రంలా మార్చేసి, విద్య-ఉద్యోగాలకు దూరం చేసిన దుర్మార్గపు రోజులు మళ్ళీ వచ్చేశాయని విజయశాంతి అన్నారు.

మధ్యయుగపు మూర్ఖపు శిక్షలు
నిబంధనలు పాటించని వారిని రాళ్లతో కొట్టి చంపడం, చిన్న తప్పులకే బహిరంగంగా కాళ్ళు, చేతులు నరకడం, మత గ్రంథంలోని నిబంధనలు అనుసరించకపోతే తల నరికేయడం, చెట్టుకు వేలాడదీసి ఉరివేయడం, బతికుండగానే తగులబెట్టడం లాంటి దారుణమైన మధ్యయుగపు మూర్ఖపు శిక్షలు వారికి నిత్యకృత్యం అని విజయశాంతి గుర్తుచేశారు. బురఖా ధరించని నడివయసు మహిళను తలపై కాల్చి చంపిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంతటి నీచ నికృష్టమైన తాలిబన్ సర్కారును పాకిస్తాన్ గుర్తించి ఆ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని ప్రశంసించడంలో ఆశ్చర్యమేమీ లేదన్నారు.

నోరు మెదపరేం..
పరిణామాలపై దేశంలోని కమ్యూనిస్ట్ నేతలు, కాంగ్రెస్ నేతలు ఇంతవరకూ స్పందించనే లేదన్నారు. తాలిబన్లతో చర్చలకు అవకాశముండాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కేంద్రానికి సలహా ఇచ్చి తన సంస్కారాన్ని చాటుకున్నారు. తాలిబన్ల కంటే పలు రెట్లు అధికంగా ప్రభుత్వ సైన్యం ఉన్నప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ భద్రతా దళాలు తోకముడిచాయి. ఇది పూర్తిగా దేశభక్తి, జాతీయవాద చైతన్యం లేని ఆ దేశ ప్రజల ఘోర వైఫల్యం తప్ప మరొకటి కాదు. తాలిబన్లు కేవలం ఆప్ఘనిస్థాన్‌తో ఆగిపోరని, చైనా-పాక్ తోడ్పాటుతో దీర్ఘ కాలంలో వారి లక్ష్యం భారత్ అని కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో కనిపిస్తున్న పోస్టులను బట్టి తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో భారతీయుల ఐక్యతే శ్రీరామరక్ష అని విజయశాంతి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications