మొదటిసీటు నాయీబ్రాహ్మణులకు, రెండో సీటు రజకులకు: చంద్రబాబు
ఖమ్మం సభ తర్వాత తెలంగాణ టీడీపీ ఏం చేయబోతోందనే ఉత్కంఠ అందరిలో ఏర్పడింది
ఖమ్మం సభ తర్వాత తెలంగాణ టీడీపీ ఏం చేయబోతోందనే ఉత్కంఠ అందరిలో ఏర్పడింది. తాజాగా ఇంటింటికి టీడీపీ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఖమ్మం సభ జరిగిన తర్వాత దాదాపుగా ప్రతీ నియోజకవర్గంలోనూ టీడీపీ సానుభూతిపరుల గ్రూప్ ఒకటి సిద్ధమైంది. సోషల్ మీడియాలో గ్రూపులు క్రియేట్ చేసి.. రోడ్ల మీదకు రావడం ప్రారంభించారు. అయితే వీరందరినీ సమన్వయం చేసుకునే నాయకుడు కనిపించడంలేదు.
తెలంగాణలో టీడీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్టీఆర్ భవన్ లో ప్రారంభించారు.తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పార్టీ నేతలందరికీ చంద్రబాబు చేతులమీదగా కిట్లను పంపిణీ చేశారు. పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి నాయకులంతా సిద్ధంగా ఉండాలని, నెలరోజులపాటు గ్రామాల్లో, పట్టణాల్లోనే ఉండాలన్నారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా పార్టీని బలోపేతం చేస్తామని, పార్టీలో చేరికకు ఇతర పార్టీల నుంచి నేతలు సిద్ధంగా ఉన్నారని కాసాని చెబుతున్నారు.

తెలంగాణ గడ్డపైనే ఎన్టీఆర్ టీడీపీని ఏర్పాటు చేశారని, తెలుగుదేశం ఎక్కడ? అనే నాయకులు ఇక్కడకు వచ్చి చూస్తే పార్టీ ఎక్కడుందో తెలుస్తుందని చంద్రబాబు అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు తెలంగాణ గడ్డపైనే టీడీపీ ఆవిర్భవించిందన్నారు. తెలుగువారు ఎక్కడున్నా వారికోసం తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని, చరిత్ర ఉన్నంతవరకు టీడీపీ ఉంటుందన్నారు. తెలంగాణ టీడీపీ కాసాని నేతృత్వంలో పరుగులు తీస్తోందని, తెలంగాణలో మొదటి సీటు నాయీ బ్రాహ్మణులకు, రెండోసీటు రజకులకు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు.












Click it and Unblock the Notifications