మంటగలిసిన మానవత్వం:మరుభూమే వారికి క్వారంటైన్ సెంటర్
ఖానాపూర్ : కరోనావైరస్ దేశంలో విజృంభిస్తోంది. ఇప్పటికే కొన్ని లక్షల మంది కరోనావైరస్ బారిన పడగా చాలామందిని ఈ మహమ్మారి బలితీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. ఈ కష్టసమయాల్లో మానవత్వం కూడా మంటగలుస్తోంది. ఇప్పటికే కరోనాతో మృతి చెందిన వారి అంత్యక్రియలు ఎలా చేశారో వార్తల్లో చూస్తున్నాం వింటున్నాం. ఈ మహమ్మారి దెబ్బకు చనిపోయిన వారిని తాకేందుకే జంకుతున్నారు. అంత్యక్రియలు చేసేందుకు కూడా సొంత మనుషులు ముందుకు రావడం లేదు. ఇక కరోనా మనిషిని మరో మనిషికి దూరం చేసింది. సొంతవారు శ్వాస తీసుకోలేక ఇబ్బంది పడుతుండటం కళ్లముందే కనిపిస్తున్నా సాహసం చేసి ముందుకు అడుగు వేయలేని పరిస్థితిని తీసుకొచ్చింది ఈ మాయదారి మహమ్మారి.
ఇక కరోనావైరస్ రోజురోజుకూ తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. ఇంటి నుంచి బయటపెట్టాలంటేనే చాలామంది భయపడుతున్నారు. ప్రభుత్వాలు తగు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఈ వైరస్‌కు ఎక్కడా బ్రేకులు పడటం లేదు. మనిషి జీవితాన్ని ఛిన్నాభిన్నం చేస్తోంది. తాజాగా నారాయణఖేడ్ జిల్లాలో అమానవీయ ఘటన ఒకటి చోటుచేసుకుంది. ఖానాపూర్ తండాలో నలుగురికి కరోనా వైరస్ పాజిటివ్ సోకగా ఆ గ్రామస్తులంతా కలిసి వీరిని వెలేశారు. వారు తమ గ్రామంలో ఉంటే గ్రామం మొత్తం కరోనావైరస్ బారిన పడే అవకాశం ఉందని భావించి వారిని తరిమేశారు. దీంతో వారికి స్మశానమే క్వారంటైన్ సెంటర్‌గా అయ్యింది.

ఖానాపూర్ తండాలోని గ్రామస్తులు వారందరిని వెలేయడంతో ఎక్కడికి వెళ్లాలో తెలియక ఊరి బయట కొత్తగా నిర్మాణంలో ఉన్న స్మశానంలోనే క్వారంటైన్ ఉంటున్నారు. ఇక రోజు వీరి కుటుంబ సభ్యులు భోజనం తీసుకొస్తున్నారు. వైద్యులు మందులు ఇస్తున్నారు. ఇదిలా ఉంటే స్మశానం పక్కన నివాసం ఉంటున్న వారు కూడా వారిని అక్కడ ఉండకూడదని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో ఎటు వెళ్లాలో తమకు అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కరోనా బాధితులు.












Click it and Unblock the Notifications