Lasya Nanditha: కంటోన్మెంట్ ఉపఎన్నికలో పోటీ చేయనున్న లాస్య నందిత సోదరి..
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత సోదరి నివేదిత చెప్పారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల అభీష్టం మేరకు పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. నివేదిత శనివారం కంటోన్మెంట్ కు చెందిన బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ భేటీలో లాస్య నందిత మృతికి సంతాపం తెలిపారు. 2 నిమిషాల పాటు మౌనం పాటించారు.
బీఆర్ఎస్ కార్యకర్తలు తమ అభిప్రాయాలను తెలిపారు. కార్యకర్తల అభిప్రాయం ప్రకారమే తాను పోటీ చేయబోతున్నట్లు నివేదిత తెలిపారు. కంటోన్మెంట్ ఉపఎన్నిక ఏకగ్రీవం కోసం అన్ని పార్టీలు కలిసి రావాలని ఆమె కోరారు. కాగా.. తన టికెట్ విషయమై బీఆర్ఎస్ అధిష్ఠానాన్ని త్వరలో కలుస్తానని చెప్పారు. ఎన్నికలు జరగాల్సి వస్తే కంటోన్మెంట్ ప్రజల ఆశీర్వదించాలని కోరారు. గత నెలలో ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

ఫిబ్రవరి 23న ఓఆర్‌ఆర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందారు. పటాన్‌చెరు సమీపంలో ఓఆర్‌ఆర్‌పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఎమ్మెల్యే లాస్య నందిత అంతకు ముందు జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. నల్గొండ బీఆర్‌ఎస్ బహిరంగ సభకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగింది. దివంగత సాయన్న మరణంతో లాస్య నందిత ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు.
ఇప్పుడు లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆమె సోదరి ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ స్థానంలో బీఆర్ఎస్ నుంచి లాస్య నందిత, కాంగ్రెస్ నుంచి గద్దర్ కూతురు వెన్నెల, బీజేపీ నుంచి గణేశ్ నారాయణ్ పోటీ చేశారు.












Click it and Unblock the Notifications