17వ తేదీ నుంచి ఉజ్జయిని బోనాలు.. ఏర్పాట్లపై మంత్రి తలసాని సమీక్ష
హైదరాబాద్ అంటే చార్మినార్, బిర్యానియే కాదు.. బోనాల వేడుక కూడా. సంవత్సరంలో ఒకసారి జరుగుతాయి.. కానీ వైభవంగా జరుగుతాయి. ఆషాడ మాసంలో బోనాల శోభ ఉంటుంది. బోనాల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. జులై 17వ తేదీన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయనున్నారు. వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసం వద్ద వివిధ శాఖల అధికారులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష నిర్వహించారు.

పనులు పూర్తి చేయాలి..
బాటా నుంచి రాంగోపాల్ పేట ఓల్డ్ పోలీసు స్టేషన్ వరకు చేపట్టిన వీడీసీసీ రోడ్డు నిర్మాణం..ఆలయ పరిసరాలలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి మంత్రి తలసాని సమీక్షించారు. రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు స్పష్టంచేశారు. ఉత్సవాలు ప్రారంభం అయ్యే వరకు అభివృద్ధి పనులు పూర్తి చేయాలని సూచించారు.

భారీగా భక్తుల రాక..
ప్రసిద్ధి గాంచిన మహంకాళి బోనాల సందర్భంగా అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున వస్తారు. ఎలాంటి అసౌకర్యం కలుగుకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. భక్తుల మధ్య తోపులాట లేకుండా భారీకేడ్ ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలని కోరారు. ప్రత్యేక పోలీసు సిబ్బందిని నియమించాలన్నారు. అమ్మవారికి బోనాలు తీసుకొచ్చే వారు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ఏర్పాట్లు చేయాలని పోలీసు, దేవాదాయ శాఖ అధికారులను సూచనలు చేశారు.


దేవికి బోనం
భోజనం అని అర్థం కలిగిన బోనం.. దేవికి సమర్పించే నైవేద్యం. మహిళలు వండిన అన్నంతోపాటు పాలు, పెరుగు, బెల్లం, కొన్నిసార్లు ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని మట్టి లేక రాగి కుండలలో తల పై పెట్టుకుని దేవి గుడికి తీసుకెళతారు. మహిళలు తీసుకెళ్ళే బోనాల కుండలను చిన్న వేప రెమ్మలతో, పసుపు, కుంకుమతో అలంకరిస్తారు. మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ పేర్లతో ఆలయాలను అలంకరిస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత బోనాలను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు. ఆషాఢ మాసంలో దేవి తన పుట్టింటికి వెళుతుందని నమ్మకం; అందుకే పండుగ సమయంలో దేవిని దర్శించుకుని తమ కూతురు ఇంటికి వచ్చిన భావనతో, భక్తి శ్రద్ధలతోనే నిర్వహిస్తారు. బోనాల సెలబ్రేషన్స్ నెలరోజుల పాటు కొనసాగుతాయి.