చేనేత వృత్తి వారసత్వ కళాసంపద, జీఎస్టీని ఎత్తేయాలి: ప్రధాని మోడీకి కవిత లేఖ
చేనేత వృతికి టీఆర్ఎస్ సర్కార్ జీవం పోసింది. ఈ విషయాన్ని పదే పదే సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు చెబుతుంటారు. ఈ విషయాన్ని మరోసారి ఎమ్మెల్సీ కవిత గుర్తుచేశారు. చేనేత వృత్తి వ్యాపారం కాదని, అది దేశ వారసత్వ కళాసంపదనని కవిత స్పష్టం చేశారు. చేనేత కళాకారులు గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేదలు, బలహీన వర్గాల వారిని పేర్కొన్నారు.
అలాంటి పేదలపై జీఎస్టీ వేసి, దోపిడీ చేయడం సరికాదని కవిత సూచించారు. ఈ మేరకు ప్రధాని మోడీకి లేఖ రాశారు. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ రద్దుచేయాలని ఆదివారం ప్రధాని మోడీకి పోస్ట్ కార్డు రాశారు. మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు కవిత లెటర్ రాశారు. చేనేత పరిశ్రమ చేనేత కళాకారుడి నైపుణ్యత, సృజనాత్మకత, కష్టంపై ఆధారపడి మనుగడ సాగిస్తోందని వివరించారు. చేనేత కళాకారుడిలో వ్యాపార దృక్పథం ఏ కోశాన లేదని వివరించారు.

స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేనేత ముడి సరుకులపై, చేనేత వస్త్రాలపై పన్ను విధించలేదని గుర్తు చేశారు. చేనేతకు వాడే ముడి సరుకులపై, చేనేత వస్త్రాలపై 5% జీఎస్టీ విధించి, దాన్ని 12% కు పెంచాలనుకోవడం సరికాదన్నారు. ఇదీ చేనేత కార్మికుల పాలిట ఉరితాడు అవుతుందని తెలిపారు.
కోట్లాది పేదల జీవితాల కోసం, చేనేత ముడి సరకులపై, చేనేత వస్త్రాలపై జీఎస్టీని రద్దు చేయాలని ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు. చేనేత సంబంధిత వస్తువులపై జీఎస్టీని పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేశారు. చేనేత ఉత్పత్తులపై GST 5%, 12% వద్దన్నారు. అసలు ఉండొద్దని ఆమె కోరారు. మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపును అందుకొని చేనేతపై జీఎస్టీని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ప్రతి ఒక్కరూ ప్రధానికి పోస్ట్ కార్డ్ రాయాలని కవిత కోరారు.