అంతా మల్లారెడ్డే అయితే, మేమెంటి?: మళ్లీ పదవులు వాళ్లకేనా? అంటూ ఎమ్మెల్యే మైనంపల్లి
హైదరాబాద్: బీఆర్ఎస్‌లో అసంతృప్త ఎమ్మెల్యేల భేటీ కలకలం రేపుతోంది. మంత్రి మల్లారెడ్డి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆధ్వర్యంలో ఆయన నివాసంలోనే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, ఉప్పల్ ఎమ్మెల్యే భేటీ సుభాస్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

పదవులన్నీ వాళ్లకే మళ్లీ మళ్లీనా?: మైనంపల్లి అసంతృప్తి
అనంతరం మైనంపల్లి హన్మంతరావు సహా ఈ ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. పదవులు వచ్చిన వాళ్లకే మళ్లీ వస్తున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక్కో వ్యక్తి మూడు, నాలుగు పదవులు తెచ్చుకుంటున్నారని విమర్శించారు. తన కుమారుడైనా సమర్థంగా పనిచేస్తేనే పదవులు వస్తాయని హన్మంతరావు అన్నారు. తన కుమారుడిని బలవంతంగా రాజకీయాల్లోకి తేవడం లేదన్నారు. ఇప్పటి వరకు పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు పదవులు రావాలనే.. ఇప్పుడు డిమాండ్ చేస్తున్నామన్నారు.

సమస్యే మంత్రి మల్లారెడ్డి అంటూ మైనంపల్లి
కొన్ని అంశాలు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లేందుకు అంతా కలిసి మాట్లాడుకున్నామని మైనంపల్లి స్పష్టం చేశారు. కొందరు మంత్రులు వాళ్లకు సంబంధించిన వ్యక్తులకే నాలుగేసి పదవులు ఇప్పించుకుంటున్నారని హన్మంతరావు మండిపడ్డారు. దీనిపై నియోజకవర్గాల్లోని పార్టీ కార్యకర్తలు తమను నిలదీస్తున్నారని చెప్పారు. మంత్రుల వ్యక్తులకే పదవులు ఇచ్చి.. ఎమ్మెల్యేలను పట్టించుకోవడం లేదని మైనంపల్లి హన్మంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యకు కారణమే మంత్రి మల్లారెడ్డి అయితే.. మళ్లీ ఆయనను ఎలా పిలుస్తామని అన్నారు. కొత్త వ్యక్తులకు పదవులు ఇస్తే తాము కూడా అభినందిస్తామన్నారు. తాను కేవలం మేడ్చల్ నియోజకవర్గం గురించి మాత్రమే మాట్లాడుతున్నామని మైనంపల్లి స్పష్టం చేశారు.

తమపై పార్టీ వ్యతిరేక ముద్ర వేసే కుట్రంటూ వివేకానంద
తాము అంతర్గతంగా మాట్లాడుకున్న విషయాలు బయటకు ఎలా వెళ్లాయని మరో ఎమ్మెల్యే వివేకానంద గౌడ అసహనం వ్యక్తం చేశారు. తమపై పార్టీ వ్యతిరేక ముద్ర వేసేందుకు ఎవరో ఈ కుట్ర చేశారని ధ్వజమెత్తారు. జిల్లా నాయకత్వం వైఫల్యాన్ని, తమ అభిప్రాయాలను పార్టీ అధిష్టానం కేసీఆర్, కేటీఆర్ దృష్టికి తీసుకెళతామని చెప్పారు. ఈ సమావేశానికి అంత ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటికైనా మేడ్చల్ జిల్లా మంత్రి అందరినీ కలుపుకుని వెళతారని ఆశిస్తున్నట్లు మల్లారెడ్డి పేరు చెప్పకుండా వివేకానంద వ్యాఖ్యానించారు.

మైనంపల్లి సహా ఆ ఎమ్మెల్యేల అసంతృప్తి అందుకే.!
గ్రంథాలయ ఛైర్మన్, మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ పదవిపై కేటీఆర్‌తో చర్చించి నిర్ణయం తీసుకుందామని తాము చెప్పినా మంత్రి హడావిడిగా జీవో ఇప్పించేశారన్నది ఈ ఎమ్మెల్యేల ఆగ్రహానికి కారణమైనట్లు తెలుస్తోంది. అందరితో చర్చించి నిర్ణయం తీసుకోవాలని గతంలో సీఎం కేసీఆర్ సూచించినా.. మంత్రి మల్లారెడ్డి ఏ మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. అన్ని పదవులు ఆయన మనుషులకే ఇస్తే ఇక తమ నియోజకవర్గాల్లోని కార్యకర్తల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు ఎమ్మెల్యేలు. ఈ అంశాన్ని కేసీఆర్, కేటీఆర్ దగ్గరే తేల్చుకుంటామని చెబుతున్నారు మైనంపల్లి సహా ఎమ్మెల్యేలు స్పష్టం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications