గ్రామీణం ఉట్టిపడేలా నెక్లెస్ రోడ్ నీరా కేఫ్.. ప్రభుత్వ ఉద్దేశం, ప్రత్యేకతలివే!!
భాగ్యనగర వాసుల కోసం గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా నీరా కేఫ్ అందుబాటులోకి రానుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్ లో నిర్మించిన ఈ నీరా కేఫ్ ను బుధవారం నాడు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ప్రజలకు స్వచ్ఛమైన, ప్రకృతి సిద్ధమైన నీరాను అందించడం కోసం ప్రభుత్వం 12.20 కోట్ల రూపాయలతో హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో నీరా కేఫ్ ను సుందరంగా నిర్మించింది.
హైదరాబాద్ నగర వాసులతోపాటు, పర్యాటకుల కోసం ఈ నీరా కేఫ్ ను సుందరంగా తీర్చి దిద్దినట్టు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఇదిలా ఉంటే భువనగిరిలోని నందనం, రంగారెడ్డి లోని ముద్విన్, సంగారెడ్డిలోని మునిపల్లి, నల్గొండలోని సర్వేల్ లో నాలుగు నీరా సేకరించే కేంద్రాల కోసం ప్రభుత్వం ఎనిమిది కోట్ల రూపాయలను మంజూరు చేసింది. మొత్తం 319 మంది గీత కార్మికులను గుర్తించి శిక్షణ కూడా ఇప్పించింది.

సిటీలో ఉండే ప్రజలకు నీరాను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం నీరా కేఫ్ ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం నెక్లెస్ రోడ్ లో ఏర్పాటు చేసిన నీరా కేఫ్ లో 300 నుంచి 500 మంది కూర్చునేలా సీటింగ్ అరేంజ్మెంట్స్ చేశారు. ఇక ఈ నీరా కేఫ్ నుండి టేక్ అవే సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నారు. కేఫ్ లో ఏడు స్టాల్స్ ను ఏర్పాటు చేశారు.
తాటిచెట్లు, మట్టికుండలు, కల్లుగీత దృశ్యాలు, తాటాకు ఆకారం వచ్చేలా కేఫ్ పై కప్పు తయారు చేశారు. అంతేకాదు కేఫ్ దగ్గర బోటింగ్ సౌకర్యాన్ని కూడా కల్పించనున్నారు. నెక్లెస్ రోడ్ లో ఉన్న నీరా కేఫ్ నుంచి బుద్ధుడి విగ్రహం వరకు బోటింగ్ ఏర్పాట్లను సైతం చేస్తున్నారు. నీరా కేఫ్ లను ఏర్పాటు చేయడంవల్ల గ్రామీణ ప్రాంతాలలో దొరికే నీరా నగర వాసులకు కూడా ఈజీగా దొరుకుతుంది.
తద్వారా గీత కార్మికులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే గీత కార్మికుల వృత్తిని చాలామంది వద్దని భావిస్తూ ఇతర వృత్తుల వైపు ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో, గీత కార్మికులను ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చాలా మంచిదని గౌడ సంఘం నేతలు చెబుతున్నారు. ఏది ఏమైనా రేపు ప్రారంభం కానున్న నీరా కేఫ్ నగర వాసులకు ఒక గొప్ప అనుభూతిని అందిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.












Click it and Unblock the Notifications