వర్షాలపై అధికారులను అలర్ట్ చేసిన సీఎం కేసీఆర్, రెవెన్యూ సదస్సు వాయిదా
వర్షం దంచి కొడుతుంది. అప్పుడప్పుడు ముసురు.. మిగతా సమయంలో వర్షం పడుతోంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ప్రభుత్వ శాఖల యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు సహా సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించాలని స్పష్టంచేశారు. వరద ముంపు ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, రెస్క్యూ టీమ్‌ను అప్రమత్తం చేయాలని సూచించారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ఉన్నసంగతి తెలిసిందే. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని కోరారు. వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహిస్తానని సీఎం కేసీఆర్ తెలిపారు. జిల్లాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల నేతలు, ప్రజాప్రతినిధులు తమ ప్రాంత ప్రజల రక్షణ నిమిత్తం అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ అన్నారు. రక్షణ చర్యల్లో ప్రజలకు సాయపడుతూ.. నష్టాలను జరగకుండా చూసుకోవలని ప్రజా ప్రతినిధులకు పిలుపునిచ్చారు.

వర్షాల నేపథ్యంలో రిస్క్ తీసుకోవద్దని, అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లకుండా ఉండాలని ప్రజలకు సీఎం కేసీఆర్ విజ్జప్తి చేశారు. గోదావరి ప్రాణహిత నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో భారీ ఎత్తున వరదలు వస్తున్నాయి. ఇరిగేషన్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, సంబంధిత చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ అలర్ట్ చేశారు.
వర్షాల నేపథ్యంలో ఈ నెల 11వ తేదీన ప్రగతి భవన్‌లో జరగాల్సిన 'రెవెన్యూ సదస్సులను' మరో తేదీకి వాయిదా వేశారు. ఇందుకు సంబంధించిన తేదీలను వాతావరణ పరిస్థితి చక్కదిద్దుకున్న తర్వాత ప్రకటిస్తామని సీఎం అన్నారు. మిగతా కార్యక్రమాలు వాయిదా వేసి.. వర్ష ప్రభావిత ప్రాంతాలు, సహాయక చర్యలపై సమీక్షిస్తున్నారు.












Click it and Unblock the Notifications