హెచ్ఐసీసీలో తెలంగాణ ఇంటెలీజెన్స్ అధికారుల కలకలం: పట్టేసిన బీజేపీ నేత, కేసీఆర్ సారీకి డిమాండ్
హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య ప్రతి విషయంలోనూ పరోక్షంగా యుద్ధమే జరుగుతోంది. తాజాగా, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న హెచ్‌ఐసీసీలో టీఆర్ఎస్ సర్కారు నిఘా పెట్టిందనే విషయం కలకలంగా మారింది. దీంతో బీజేపీ నేతలు కేసీఆర్ సర్కారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే?.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఇంటెలిజెన్స్ అధికారులు బీజేపీ జాతీయ సమావేశాలు జరుగుతున్న హాల్లోకి ప్రవేశించారంటూ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఇంటెలిజెన్స్ అధికారులను బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి గుర్తించారు.

బీజేపీ సమావేశాలను చూసి ఓర్వలేక కేసీఆర్ ప్రభుత్వం ఈ విధంగా దిగజారుడు చర్యలకు పాల్పడుతోందని సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. సమావేశంలో జరిగే చర్చ వివరాలను బయటకు చెప్పేందుకే నిఘా అధికారులు పోలీసు పాస్‌లతో లోనికి ప్రవేశించారన్నారు.
తీర్మానాల కాపీని ఫొటో తీస్తుంటే గుర్తించి పోలీస్ కమిషనర్‌కు అప్పజెప్పామని.. ఫొటోలు డిలీట్ చేయించామని ఇంద్రసేనా రెడ్డి తెలిపారు. ఏ పార్టీ ప్రైవసీ వాళ్లకి ఉంటుందన్నారు. ఏదైనా ఉంటే డైరెక్ట్ చేయాలి తప్ప ఇలా వ్యవహరించడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని ఇంద్రసేనారెడ్డి డిమాండ్ చేశారు.
ఇంటెలిజెన్స్ సీఐ శ్రీనివాస్ లోపవలికి వచ్చి రహస్యంగా ఫొటోలు తీస్తుండగా బీజేపీ నేత ఇంద్రసేనా రెడ్డి పట్టుకున్నారు. ఎందుకు ఫొటోలు తీస్తున్నావని ప్రశ్నించారు. ఆ తర్వాత బయటకు పంపి.. సీపీకి అప్పగించారు. ఇంటెలిజెన్స్ అధికారులు వ్యవహారంపై కేసీఆర్ సర్కారు క్షమాపణలు చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications