సూపర్ ఓవర్‌లో 4,6,4,6,6,4: పసికూన చేతిలో మట్టికరిచిన విండీస్ వీరులు
హరారే: ఐసీసీ వరల్డ్ కప్..క్వాలిఫయర్స్‌లో సంచలనం నమోదైంది. వెస్టిండీస్ నిర్దేశించిన 374 పరుగుల భారీ లక్ష్యాన్ని పసికూన నెదర్లాండ్స్ సమం చేసింది. అనంతరం జరిగిన సూపర్ ఓవర్‌లో కరేబియన్ కింగ్స్‌ను మట్టికరిపించింది. సూపర్ ఓవర్‌లో ఏకంగా 30 పరుగులను పిండుకుంది నెదర్లాండ్స్. ఈ లక్ష్యాన్ని వెస్టిండీస్ అందుకోలేకపోయింది. ఎనిమిది పరుగులకే చతికిలపడింది.
జింబాబ్వే రాజధాని హరారే స్పోర్స్ట్ క్లబ్ స్టేడియంలో కొద్దిసేపటి కిందటే ముగిసిన క్వాలిఫయర్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ నిప్పులు చెరిగింది. ఆకాశమే హద్దుగా చెలరేగింది. వెస్టిండీస్ వీరులను మట్టి కరిపించింది. వెస్టిండీస్ నిర్దేశించిన 374 పరుగులను అందుకున్న తరువాత సూపర్ ఓవర్‌లో 30 పరుగులను పిండుకుంది నెదర్లాండ్స్. ఈ లక్ష్యాన్ని ఛేదించడంలో చేతులెత్తేసింది విండీస్. ఎనిమిది పరుగులే చేయగలిగింది.

తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లల్లో ఆరు వికెట్ల నష్టానికి 374 పరుగులు చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ నికొలస్ పూరన్ సెంచరీ బాదాడీ మ్యాచ్‌లో. 65 బంతుల్లో ఆరు సిక్సర్లు, తొమ్మిది ఫోర్లతో 104 పరుగులు చేశాడు. బ్రెండన్ కింగ్- 76, జాన్సన్ ఛార్లెస్- 54, షమారా బ్రూక్స్- 25, షై హోప్- 47, చివర్లో కీమో పాల్- 46తో స్టేడియంలో పరుగుల వరద పారింది.
ఈ భారీ టార్గెట్‌ను ఛేదించడానికి బరిలోకి దిగిన పసికూన నెదర్లాండ్స్ ఏ మాత్రం అదరలేదు.. బెదరలేదు. తొలి ఓవర్ నుంచే విరుచుకుపడింది. విక్రమ్‌జీత్ సింగ్- 37, మ్యాక్స్ ఓడౌడ్- 36, వెస్లీ బర్రెసీ- 27, బాస్ డీ లెడె- 33 పరుగులు చేశారు. విజయవాడ కుర్రాడు తేజ నిడమానూరు సెంచరీతో చెలరేగాడు. 76 బంతుల్లో మూడు సిక్సర్లు, 11 మెరుపుల్లాంటి ఫోర్లతో 111 పరుగులు చేశాడు.
అతనికి కేప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ తోడయ్యాడు. 47 బంతుల్లో 67 పరుగులు చేశాడు స్కాట్. ఆల్‌రౌండర్ లొగాన్ వాన్ బీక్- 28, ఆర్యన్ దత్- 16 పరుగులతో చివరి వరకూ పోరాడారు. ఫలితంగా- నెదర్లాండ్స్ కూడా నిర్ణీత 50 ఓవర్లల్లో సరిగ్గా 374 పరుగులు చేసింది. దీనితో మ్యాచ్ విజేతను నిర్ధారించడానికి సూపర్ ఓవర్ అవసరమైంది.

సూపర్ ఓవర్‌లో తొలుత నెదర్లాండ్స్ బ్యాటింగ్‌కు దిగింది. ఆల్‌రౌండర్ లొగాన్ వాన్ బీక్, కేప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ బరిలోకి దిగారు. విండీస్ ఆల్ రౌండర్ జేసన్ హోల్డర్ బంతిని అందుకున్నాడు. అతను ఘోరంగా విఫలం అయ్యాడు. సూపర్ ఓవర్‌లో స్ట్రైకింగ్‌కు దిగిన వాన్ బీక్ ఒక్కటంటే ఒక్క బంతిని కూడా వేస్ట్ చేయలేదు. 4,6,4,6,6,4 పరుగులు పిండుకున్నాడు.
అనంతరం నెదర్లాండ్స్ తరఫున వాన్ బీక్.. సూపర్ ఓవర్‌కు దిగాడు. అక్కడా మెరిశాడు. ఆరు బంతుల్లో ఎనిమిది పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు కూల్చాడు. తొలి బంతిని విండీస్ బ్యాటర్ ఛార్లెస్ సిక్స్‌గా మలిచాడు. ఆ తరువాతి రెండు బంతులకు రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. చివరి రెండు బంతులకు వాన్ బీక్ రెండు వికెట్లను తీసుకున్నాడు.












Click it and Unblock the Notifications