ఓ తండ్రి అమానుషం : 11 గంటలు బిక్కుబిక్కుమంటూ నదిలో కూతురు..
థానే : కొత్త 'షూ'లు కొనిస్తానని చెప్పడంతో.. ఆ చిన్నారి సంబరపడుతూ నాన్న వెంట వెళ్లింది. కానీ మనసులో కర్కషత్వాన్ని నింపుకున్న ఆ తండ్రి చిన్నారిని వదిలించుకోవాలనే దురుద్దేశంతోనే బయటకు తీసుకెళ్లాడు. అనంతరం ఆమెను ఓ నదిలోకి విసిరేసి ఏమి తెలియనట్టు ఇంటికెళ్లిపోయాడు. ఇదంతా తెలియని తల్లి స్థానిక పోలీస్ స్టేషన్ లో పాప తప్పిపోయినట్టుగా ఫిర్యాదు చేసింది.
ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పరిశీలిస్తే.. మహారాష్ట్రలోని థానేలో నివసించే ఓ వ్యక్తి 'షూ' లు కొనిస్తానని చెప్పి పదేళ్ల తన కూతురును బయటకు తీసుకెళ్లాడు. అయితే మనసులో ఏ దురుద్దేశం పెట్టుకున్నాడో ఏమో గానీ మార్గ మధ్యలో బద్లాపూర్ వద్దకు చేరుకోగానే అక్కడున్న ఓ వంతెన పైనుంచి చిన్నారిని ఉల్హాస్ అనే ఆ నదిలోకి విసిరేశాడు.

అయితే అదృష్టవశాత్తు 11 గంటల తర్వాత ఆ చిన్నారి సురక్షితంగా ప్రాణాలతో బయటపడింది. పాపను సదరు తండ్రి నదిలో విసిరేసి వెళ్లాక, మరుసటి రోజు ఉదయం వంతెన నిర్మాణ పనులకు సంబంధించి అక్కడే విధులు నిర్వహిస్తున్న రమేశ్ బొహెయిర్ (35) సెక్యూరిటీ గార్డు వంతెన కింద నుంచి చిన్నారి ఏడుపులు వినపడ్డం గమనించాడు.
ఆలస్యం చేయకుండా వెంటనే విషయం పోలీసులకు చేరవేశాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి చిన్నారిని రక్షించారు. అయితే నదిలో ఎక్కువ శాతం గుర్రపు డెక్క పేరుకుపోయి ఉండడంతోనే పాప ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం ఏర్పడలేదని పోలీసులు తెలిపారు. కాగా, తల్లి ఫిర్యాదు మేరకు అంతకుముందే కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం పరారీలో ఉన్న సదరు తండ్రి కోసం గాలింపు ముమ్మరం చేశారు.












Click it and Unblock the Notifications