ఇంట్లో 200 లీటర్ల కిరోసిన్.. అగ్ని ప్రమాదంలో యజమాని కుటుంబంలోని 11 మంది..
ఉత్తరప్రదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. జనావాసాల మధ్య ఈ ప్రమాదం జరగడంతో ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థాలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. లక్నోలోని పారా ప్రాంతంలో ఉన్న ఓ రెండంతస్తుల ఇంట్లో ఆదివారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఒకే కుటుంబానికి చెందిన..
అగ్ని ప్రమాదంపై లక్నో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 48 ఏళ్ల ప్రకాష్ సోనీ తన కుటుంబంతో దేవ్‌పురాలోని పారాలో ఉంటున్నాడు. ఆదివారం రాత్రి 7:30 గంటల ప్రాంతంలో ప్రకాష్ సోనీ ఇంట్లో మంటలు చెలరేగాయి. ముందుగా బేస్‌మెంట్‌లో మంటలు వచ్చాయి. అవి కొద్దిసేపటికే రెండో అంతస్తును కూడా చుట్టుముట్టాయి. దీంతో గదుల్లో ఉన్న ప్రకాష్ కుటుంబ సభ్యులు ప్రాణ భయంతో కేకలు వేశారు. వారి ఆర్తనాధాలతో అక్కడ భయానక వాతావరణం నెరకొంది. ప్రధాన ద్వారం వద్ద మంటలు చెలరేగడంతో స్థానికులు వారిని బయటకు తెచ్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.

క్షతగాత్రులకు చికిత్స..
వెంటనే అక్కడివారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది రెండు గంటలపాటు శ్రమించి ఇంట్లో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. తీవ్రంగా కాలిన గాయాలతో ఉన్న 11 మందిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రకాష్ సోనీ, అతని భార్య క్షమా సోని (44), అన్షు వర్మ (31), శోభిత్ వర్మ (35), తనూ సోని (21), మను సోని (21), అక్షత్ వర్మ (8), రుచి సోని (27) , ఆధ్య వర్మ (12), అర్జున్ భారతియా (18) సహా మొత్తం 11 మంది కాలిపోయారు. వీరిలో రుచి, ఆదిల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నామని వైద్యులు వెల్లడించారు. ఇంట్లో నిల్వ చేసిన 200 కిలోసిన్ వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications