కులం చూడం- మతం చూడం: పార్టీ పెట్టడానికి కారణం వెల్లడించిన విజయ్..!!
Thalapathy Vijay: తమిళ నటుడు విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించడం ఖాయమైంది. ఆయన సొంత పార్టీని ప్రకటించారు. తమిళనాట ఇళయ దళపతిగా లక్షలాదిమంది అభిమానులు, ఫాలోవర్లను సంపాదించుకున్న ఉన్న విజయ్ రాజకీయ అరంగేట్రం చేశారు. తాను నెలకొల్పిన పార్టీ పేరును అధికారికంగా ప్రకటించారు. తమిళగ వెట్రి కజగం నామకరణం చేసినట్లు తెలిపారు.
ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. విజయ్.. రాజకీయ అరంగేట్రం చేస్తారంటూ చాలాకాలం తమిళనాడులో వార్తలు వినిపిస్తూ వస్తోన్నాయి. అప్పట్లో దీనికి సంబంధించిన బ్యానర్లు, పోస్టర్లు విస్తృతంగా వెలిశాయి. ఎట్టకేలకు అభిమానుల కోరిక మేరకు విజయ్ రాజకీయాల్లో అడుగు పెట్టారు.

పార్టీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ పనులను విజయ్ తండ్రి, ప్రముఖ దర్శకుడు ఎస్‌ఏ చంద్రశేఖర్ పూర్తి చేశారు. ఈ ఉదయం చెన్నైలో పార్టీ కార్యవర్గ సమావేశం సైతం ఏర్పాటైంది. విజయ్ అధ్యక్షతన ఈ భేటీ కొనసాగింది. ఇందులో అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై ఇందులో చర్చించారు. కొన్ని కీలక తీర్మానాలను ఆమోదించారు.
వాటి వివరాలను విజయ్ వెల్లడించారు. త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించామని పేర్కొన్నారు. కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశామని తెలిపారు. గ్రామస్థాయిలో పార్టీ నిర్మాణం జరగాల్సి ఉన్నందున.. అప్పుడే జాతీయ స్థాయి ఎన్నికల్లో పోటీ పడటం సహేతుకం కాదనే ఉద్దేశంతోనే లోక్‌సభ ఎన్నికలకు దూరంగా ఉండబోతున్నామని అన్నారు.
అలాగని- తాము ఏ పార్టీకి కూడా మద్దతు ఇవ్వట్లేదని విజయ్ స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో ఫలానా పార్టీకి ఓటు వేయాలంటూ తాము రాష్ట్ర ప్రజలకు గానీ, తమ అభిమానులకు గాని సూచించట్లేదని తేల్చి చెప్పారు. ఎవరికి ఓటు వేయాలనేది వారి సొంత నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుందని వ్యాఖ్యానించారు. తమ లక్ష్యం 2026లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలేనని విజయ్ చెప్పారు.

సమాజానికి మంచి చేయాలీ అంటే అది ఒక్క రాజకీయాల ద్వారానే సాధ్యపడుతుందని విజయ్ అన్నారు. ఇప్పటికే తన అభిమాన సంఘాలు, ఎన్జీఓలు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టినప్పటికీ.. అవి చిట్టచివరి వ్యక్తి వరకు అందట్లేదని చెప్పారు. అట్టడుగు స్థాయి వరకూ చేరట్లేదని వ్యాఖ్యానించారు.
రాజకీయాల ద్వారా ప్రతి వ్యక్తికీ మంచి చేయవచ్చనే నిర్ణయానికి వచ్చానని విజయ్ వివరించారు. అధికారంలో ఉన్న వారు విభజించి పాలించు అనే సూత్రాన్ని అనుసరిస్తోన్నారని విమర్శించారు. అవినీతి రహిత పరిపాలన, కులం-మత రహిత సమాజాన్ని సృష్టించాల్సిన బాధ్యత తనపై ఉన్నట్లు భావిస్తున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications