సోషల్ మీడియాలో 21 లక్షల మంది ఫాలోవర్లు.. ఎన్నికల్లో వచ్చింది మాత్రం 33 ఓట్లే!
డిజిటల్ ప్రపంచంలో దక్కే ప్రజాదరణ, లైకులు, ఫోలోవర్లు నిజ జీవితంలో ఓట్లుగా మారవనే చేదు నిజాన్ని రాజస్థాన్ పంచాయతీ ఎన్నికల ఫలితాలు మరోసారి రుజువు చేశాయి. సోషల్ మీడియా వేదికలపై ఏకంగా 21 లక్షలకు పైగా ఫాలోవర్లను కలిగి ఉన్న ప్రముఖ కంటెంట్ క్రియేటర్ ఓంప్రకాష్ బిష్ణోయ్.. తాజాగా జరిగిన రాజస్థాన్ పంచాయతీ ఎన్నికల్లో దారుణ పరాజయం పాలై వార్తల్లో నిలిచారు.
రాజస్థాన్‌లోని ఫలోడి జిల్లా ఇంద్రావ్ కి ధాని-2 పంచాయతీ సర్పంచ్ పదవికి ఓంప్రకాష్ బిష్ణోయ్ పోటీ చేశారు. ఆహారంలో సమృద్ధిగా నెయ్యి వేసుకుని తినే తన దేశీ స్టైల్ వీడియోలతో నెట్టింట విశేష గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. గోసేవ, మతపరమైన కార్యక్రమాల ద్వారా కూడా ప్రజాదరణ పొందేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో సర్పంచ్ బరిలో నిలిచారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఓటరును వ్యక్తిగతంగా కలిసి మద్దతు కోరిన ఓంప్రకాష్, స్వచ్ఛమైన నెయ్యితో వంటకాలు చేయించి సామూహిక భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. ప్రచారంలో అందరూ తనకు మద్దతు ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ.. ఫలితాలు వెలువడిన తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. మొత్తం 1600 ఓట్లు పోలైన ఆ పంచాయతీలో ఓంప్రకాష్‌కు దక్కింది కేవలం 33 ఓట్లు మాత్రమే. విశేషమేమిటంటే ఈ ఎన్నికల్లో నోటాకు 40 ఓట్లు రాగా.. ఆయనకు దానికంటే తక్కువ ఓట్లు రావడం గమనార్హం.
తన ఓటమిపై ఓంప్రకాష్ బిష్ణోయ్ ఆవేదన వ్యక్తం చేస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 'నాకు వచ్చిన 33 ఓట్లలో 11 ఓట్లు నా కుటుంబ సభ్యులవి కాగా.. మిగిలిన 22 ఓట్లు నా ఆత్మీయ మిత్రులు వేసినవి. నేను మాదకద్రవ్యాలు, మద్యపానానికి పూర్తిగా వ్యతిరేకిని. ఎన్నికల్లో మద్యం పంపిణీ చేయకపోవడమే నా ఓటమికి ప్రధాన కారణం. నేటికీ సమాజంలో మద్యం, ఇతర అలవాట్లను చూసే ఓట్లు వేసే పరిస్థితి ఉండటం బాధాకరం" అని ఓంప్రకాష్ బిష్ణోయ్ పేర్కొన్నారు.
కాగా ఓంప్రకాష్ బిష్ణోయ్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 14 లక్షలు, యూట్యూబ్‌లో 5 లక్షలు, ఫేస్‌బుక్‌లో 2.32 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. లక్షలాది మంది నెటిజన్లు ఆయన వీడియోలను ఆదరించినప్పటికీ.. పోలింగ్ బూత్ వద్ద ఆ క్రేజ్ ఏమాత్రం పనిచేయలేదనడానికి ఈ ఎన్నికల ఫలితాలే స్పష్టమైన నిదర్శనంగా నిలిచాయి.














Click it and Unblock the Notifications
