హైదరాబాద్ అయ్యప్ప స్వాముల బస్సును ఢీ కొట్టిన కారు- నవ దంపతులు సహా నలుగురి దుర్మరణం
Sabarimala: కేరళ శబరిమల కొండలపై వెలిసిన అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి భక్తులు వేల సంఖ్యలో తరలి వెళ్తోన్నారు. ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున మాలధారణ చేస్తోన్నారు. నియమ నిష్ఠలతో మణికంఠుడిని కొలుస్తోన్నారు. ఇప్పటివరకు 20 లక్షలమంది వరకు భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు.
మండలం-మకరవిళక్కు మహాపడి పూజల కోసం అయ్యప్ప స్వామి ఆలయం తలుపులు కిందటి నెల 15వ తేదీన తెరచుకున్న విషయం తెలిసిందే. దీనితో మండలం- మకరవిళక్కు సీజన్ ఆరంభమైంది. స్వామివారిని దర్శించుకోవడానికి ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు శబరిమలకు తరలి వెళ్తోన్నారు.

అదే సమయంలో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటోన్నాయి. తాజాగా పత్తినంథిట్ట జిల్లాలో ఈ తెల్లవారు జామున సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో కొత్తగా పెళ్లయిన దంపతులు ఉండటం వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపినట్టయింది.
మృతులను మథయ్ ఎప్పన్, అను, నిఖిల్, బిజూ జార్జ్‌గా గుర్తించారు. మృతులు పత్తినంథిట్ట సమీపంలోని మలస్సేరి గ్రామానికి చెందిన వాళ్లు. మథయ్ ఎప్పన్ కుమారుడు నిఖిల్, బిజూ జార్జ్ కుమార్తె అను కిందటి నెల 30వ తేదీన వివాహం చేసుకున్నారు. అనంతరం నవ దంపతులిద్దరూ హనీమూన్ కోసం మలేసియాకు వెళ్లారు.
హనీమూన్ ముగించుకుని రాత్రి తిరువనంతపురం విమానాశ్రయానికి చేరుకున్నారు. వారిని తీసుకుని రావడానికి మథయ్, బిజూ జార్జ్ కారులో తిరువనంతపురం వెళ్లారు. నవదంపతులను తీసుకుని కారులో స్వగ్రామానికి తిరుగుముఖం పట్టారు.
మార్గమధ్యలో ఈ తెల్లవారు జామున 4: 05 నిమిషాల సమయంలో పూనలూర్- మువట్టుపుజ రోడ్డుపై కారు ప్రమాదానికి గురైంది. కూడల్ సమీపంలోని మురింజకల్ వద్ద ఎదురుగా వస్తోన్న అయ్యప్ప స్వాముల బస్సును అదుపు తప్పి వేగంగా ఢీ కొట్టింది. హైదరాబాద్ నుంచి శబరిమలకు బయలుదేరిన బస్సు ఇది.

ఈ ఘటనలో మథయ్ ఎప్పన్, నిఖిల్, బిజూ జార్జ్ సంఘటన స్థలంలోనే మృతి చెందారు. అను పత్తినంథిట్ట ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కారు ముందు భాగం మొత్తం నుజ్జునుజ్జు అయింది. మథయ్ ఎప్పన్ ఇంటికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఈ దుర్ఘటన సంభవించింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే దీనికి కారణమని చెబుతున్నారు.
నిఖిల్- కెనడాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తోన్నాడు. వివాహం చేసుకోవడానికి స్వస్థలానికి వచ్చాడు. అనును పెళ్లాడారు. హనీమూన్ ముగించుకున్న తరువాత భార్యతో కలిసి కెనడా వెళ్లాల్సి ఉంది. ఈ లోగా ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో నిఖిల్‌తో పాటు తండ్రి ఎప్పన్, భార్య దుర్మరణం చెందడం విషాదకరం. మృతదేహాలను కొణ్ణి తాలూకా ఆసుపత్రికి తరలించారు.
అయ్యప్ప స్వాముల బస్సు డ్రైవర్, కొందరు భక్తులు స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. స్వల్పంగా గాయపడ్డ అయ్యప్ప స్వాములను సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అందించారు.












Click it and Unblock the Notifications