వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జై ఆంధ్ర ఉద్యమానికి 50 ఏళ్లు... ఇంతకీ ఉద్యమం ఎందుకు వచ్చినట్లు?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
కాకాని వెంకటరత్నం

'జై ఆంధ్ర’ ఉద్యమానికి యాభై యేళ్లు. 1972 చివరలో ఉవ్వెత్తున లేచింది 1973 మొదట్లో ఆరిపోయింది. మొన్న ప్రత్యేక తెలంగాణఉద్యమం జోరుగా సాగుతన్నరోజుల్లో కొంతమంది కోస్తాంధ్ర నాయకులు విజయవాడలో సమావేశమైనపుడు '1972 తరహా ఉద్యమానికి ఆంధ్రలో ప్రయత్నాలు’అంటూ రాయడం మినహా ఈ ఉద్యమాన్ని ఎవరూ గుర్తు చేసుకున్న దాఖలా లేదు.

1969ప్రత్యేక తెలంగాణ ఉద్యమం చల్లబడినా నివురు గప్పిన నిప్పులా ఉంటూ వచ్చింది. అవకాశం వచ్చినపుడల్లా తెలంగాణ నేతలు, విద్యార్థులు, మేధావులు ప్రత్యేక తెలంగాణ అంటూ సభలు సమాశాలు, పాదయాత్రలు, రౌండ్ టేబుల్స్ ఏర్పాటు చేస్తూ సాహిత్యం సృష్టిస్తూ ఆగ్గిరాజేస్తూ వచ్చారు.

2001లో తెలంగాణ రాష్ట్రసమితి ఏర్పడి విజయవంతం కావడం వెనక ఇంత చరిత్ర ఉంది. కాని, జై ఆంధ్ర ఉద్యమం మళ్లీ ఊపందుకోలేదు.

ఆంధ్ర ప్రాంతం నుంచి ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ మళ్లీ ఎప్పుడూ రాలేదు. ఎంతోమంది రక్తం చిందించి నడిపించిన ఒక ఉద్యమం ఇలా లక్ష్యం, దిశ లేకుండా ఎలా సాగింది? ఎటు మాయమైంది? అమాయక విద్యార్థుల త్యాగం వృథా అయినట్లేనా?

ఒక దశలో విజయవాడ రాజధానిగా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటుచేశారు. ముఖ్యమంత్రిగా బీవీ సుబ్బారెడ్డి, ఉప ముఖ్యమంత్రిగా కాకాని వెంకటరత్నం ల ఆధ్వర్యంలో ప్రభుత్వం కొంత కాలం నడించింది.

ఉద్యమ సమయంలో యువకులు చెక్ పోస్టులను ఏర్పాటుచేసి వాహనాల నుంచి పన్నులు కూడా వసూలు చేశారని 'టైమ్’మ్యాగజైన్ రాసింది. ఇంత స్థాయికి వెళ్లిన 'జై ఆంధ్ర’ఉద్యమం ఇప్పటికీ ఎవరికీ అర్థంకాని ప్రశ్న.

ఈ ఉద్యమం లక్ష్యం ఫలానా అని, ఈ ఉద్యమానికి ప్రోద్బలం ఇదీ అని ఎవరూ చెప్పలేరు. జై ఆంధ్రా నినాదం సాధించిందేమిటో కూడా అర్థం కాదు.

ఉద్యమంలో రాయలసీమ వాళ్లు కూడా పాల్గొన్నా, ప్రధానంగా కోస్తా జిల్లాల ఉద్యమంగా, భూస్వాముల మద్దతుతో సాగిన ఆందోళనగా పేరు పడింది.

కోస్తా కమ్మ తదితర కులాల భూస్వాములు ఒక లక్ష్యంతో ఉద్యమంలోపాల్గొంటే, రాయలసీమ రెడ్డి నేతలు మరొక ధ్యేయంతో పాల్గొన్నారు.

ఉద్యమానికి ఊపిరిపోసిన విద్యార్థులు ఒక లక్ష్యం తోపాల్గొన్నారు. ఎన్జీవోలు మరొక లక్ష్యంలో రంగంలోకి దూకారు. పైకి మాత్రం 1918 లో నిజాం తీసుకువచ్చిన ముల్కీ రూల్స్ కు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంగా ప్రచారమైంది.

ఉన్నత కులాల మధ్య సాగుతున్న పవర్ స్ట్రగుల్ లోకి అశేష ప్రజానీకాన్నిలాగేందుకు ముల్కీ రూల్స్ బాగా పనికొచ్చాయి.

ఈ నియమాలు అమలు చేస్తే ఆంధ్రులకు ఉద్యోగాలుండవు, హైదరాబాద్ లో ఉద్యోగాలన్నీ ముల్కీ పేరుతో తెలంగాణ వాళ్లు అందుకుంటారని భయాందోళన సృష్టించడంలో నేతలు విజయంతమయ్యారు.

ఇలా ఉద్యోగావకాశాల డిమాండ్ తో మొదలైన ఉద్యమ నినాదం నెల రోజల్లోనే ప్రత్యేకాంధ్ర ఉద్యమంగా మారిపోయింది. మరో నెలరోజుల్లో ఉద్యమాన్ని ఉపసంహరించుకున్నారు.

పేరుకు జై ఆంధ్ర ఉద్యమమే అయినా, ప్రత్యేక రాష్ట్రం నాటి నేతల నిజమైన డిమాండ్ కాదు. ఆ డిమాండ్ మధ్యలోనే వచ్చింది, మధ్యలోనే పోయింది. అందుకేనేమో మళ్లీ ఎపుడు ప్రత్యేకాంధ్ర ఉద్యమం రానేలేదు.

ఆ ఉద్యమం ఎవరికీ స్ఫూర్తిగా కాకుండా మరుగునపడిపోయింది.

పీవీపై కాంగ్రెస్ నేతలు కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు

జై ఆంధ్ర ఉద్యమం ఏమిటి?

రాజకీయాల్లో బాగా పట్టు సంపాదించిన రెడ్లను మెల్లిగా పక్కకు తప్పించే క్రమంలో ఇందిరాగాంధీ చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం వచ్చిందని డ్యాగ్మర్ బెర్న్ స్టార్ఫ్ వంటి రాజనీతి శాస్త్ర పండితులు కొందరుచెబుతారు.

కాదు, అప్పటి ముఖ్యమంత్రి పివి నరసింహారావు రాష్ట్రంలో తీసుకువస్తున్న భూసంస్కరణలకు వ్యతిరేకంగా కోస్తా భూస్వాములు, జమీందారులు లేవనెత్తిన ఉద్యమం అని హ్యూ గ్రే వంటి మరికొందరు చెబుతారు.

ఆంధ్రా ప్రాంత ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డిని తప్పించేందుకు తెలంగాణ నేతలు ఉద్యమం చేసినట్లు, తెలంగాణ ప్రాంత ముఖ్యమంత్రి పీవీని తప్పించేందుకు ఆంధ్రా నేతలు సాగించిన ఉద్యమం అని కొందరు చెబుతారు.

ఇంకొందరేమో ఇది తెలంగాణ వ్యతిరేక ఉద్యమమని, సమైక్యవాది అయిన ప్రధాని ఇందిరా గాంధీ భవిష్యత్తులో ఎపుడూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ను అంగీకరించకుండా ఉండేందుకు ఆంధ్రావాళ్లు ఆమెకు ఇచ్చిన వార్నింగే ఈ ఉద్యమం అనే వాళ్లు అన్నారు.

జై ఆంధ్ర ఉద్యమానికి ఇవన్నీ కారణాలే అని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ మాజీ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ జి.హరగోపాల్ అంటున్నారు.

అయితే, ఈ ఉద్యమం, ఏవో కొన్ని రాజకీయ లక్ష్యాలు నెరవేర్చుకుని ప్రధాన డిమాండ్ అయిన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర డిమాండ్ విషయంలో ఫెయిలందని అందరికీ తెలుసు.

జై ఆంధ్ర ఉద్యమం ఎలా మొదలైంది?

1967 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్ లో కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. లోక్ సభ ఎన్నికల్లో గెలిచిన తెలంగాణ నేత డాక్టర్ మర్రి చెన్నారెడ్డి కేంద్రంలో ఉక్కు శాఖమంత్రి అయ్యారు.

అయితే, ఎన్నికల ప్రచారంలో ఒక మసీదులో ప్రసంగించి చెన్నారెడ్డి మతభావాలు రెచ్చగొట్టారని ఆర్యసమాజ్ అభ్యర్థి వందేమాతరం రామచంద్రారావు ఎన్నికల పిటిషన్ వేశారు.

అపుడు ఈ కేసు సుప్రీంకోర్టు దాకా పోయింది. చెన్నారెడ్డి ఓడిపోయారు.

ఆరేళ్లు రాజకీయ అనర్హత శిక్ష పడింది. అంతే, ఆయన హైదరాబాద్ తిరిగొచ్చి తెలంగాణ ఉద్యమం ప్రారంభించారు. ఇది ఆంధ్రా వ్యతిరేక ఉద్యమం అయింది. ఆంధ్ర ప్రాంత ఉద్యోగులు వచ్చి తమ అవకాశాలు దెబ్బతీస్తున్నారని చెబుతూ ఉద్యోగులు ఉద్యమంలోకి దిగారు.

ఉద్యమం 1971 వరకు ఉధృతంగా సాగింది. ఆయన తెలంగాణ ప్రజాసమితి (టీపీఎస్) పార్టీ పెట్టి 10 లోక్ సభ స్థానాలను గెల్చుకున్నారు.

చివరకు చెన్నారెడ్డి సమర్పించిన ఆరు డిమాండ్లకు ప్రధాని ఇందిరాగాంధీ దిగివచ్చి మౌఖికంగా అంగీకరించడంతో ఉద్యమం చల్లారింది. టీపీఎస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు.

ఆయన సమర్పించిన డిమాండ్లలో ఆంధ్రా నాయకుడు కాసు బ్రహ్మానందరెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించడం ఒకటి.

కాంగ్రెస్ లోని ఆంధ్రా, తెలంగాణ రెడ్ల తగవులతో సతమతకావడం ఇష్టంలేని ఇందిరగాంధీ ఈ ఉద్యమం ఆసరా చేసుకుని రెడ్ల పట్టు నుంచి కాంగ్రెస్ ను బయటకు లాగాలని భావించి బ్రహ్మానంద రెడ్డి వారసుడిగా ఎలాంటి ముఠా మరకల్లేని పీవీ నరసింహారావును నియమించారు. ఆంధ్రా రెడ్లకు ఇది నచ్చలేదు.

అయినా సరే,హైకమాండ్ మీద తిరగబడటం ఇష్టం లేక కోపం దిగుమింగుకుంటూ వచ్చారు. 1972 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచాక, ఇందిరా గాంధీ తాత్కాలిక సీఎం నరసింహారావునే ముఖ్యమంత్రిగా కొనసాగించారు.

ఈ సమయంలో పీవీ నరసింహారావు ఇందిరాగాంధీ 20 సూత్రాల పథకం అమలు చేయాలనుకుంటున్నారు.

“ఇది కొంచెం పేదలకు అనుకూలమైంది. ఇందులో భూసంస్కరణలనేది ఒక ముఖ్యమయిన అంశం. భూస్వాముల నుంచి సీలింగ్ పేరుతో భూములను స్వాధీనం చేసుకోవడం దీని ఉద్దేశం. దీనిని దృష్టిలో పెట్టుకుని 1972 మే 2న ఒక అర్డినెన్స్ తో నరసింహారావు రాష్ట్రంలో భూలావాదేవీలన్నింటిని రద్దు చేశారు. సెప్టెంబర్ 15న భూసంస్కరణల బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టి పాస్ చేయించారు. ఈ రెండు చర్యలు కోస్తాంధ్ర భూస్వాములకు నచ్చలేదు. ఈ వర్గాల్లో అసంతృప్తికి కారణమైంది” అని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు.

అయితే, మరొక పరిశోధకుడు ప్రొఫెసర్ కేసీ సూరి కోస్తాంధ్ర భూస్వాముల ప్రోద్బలంతో సాగిన ఉద్యమం అనే వాదనతో ఏకీభవించ లేదు.

ఈ వాదనను నిరూపించలేమని చెబుతూ, బహశా విద్యార్థుల, ఉద్యోగుల మనోభావాలు కూడా దీనికి అదనంగా తోడై ఉండవచ్చని ఆయన 'ఆంధ్ర ప్రదేశ్:పొలిటికల్ డైనమిక్స్ ఆఫ్ రీజినలిజం. ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్ ఇన్ ఇండియా’ అనే వర్కింగ్ పేపర్ లో రాశారు.

బ్రహ్మానంద రెడ్డి తొలగింపు, నరసింహారావు భూసంస్కరణలకు ప్రజల్లో తెలంగాణ మీద వస్తున్న వ్యతిరేకత కూడా తోడయ్యింది .

“1969 తర్వాత తెలంగాణలో ఆంధ్రా వాళ్లను వేధించడం ఎక్కువయింది. చాలామంది తెలంగాణ వదలి ఆంధ్ర వచ్చారు. వాళ్లంత రకరకాల వేధింపుల కథలను మోసుకొచ్చారు. ఆంధ్రులకు తెలంగాణలో ఉనికి లేదు, హైదరాబాద్ లో ఉద్యోగాలు రావు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ అనుకూల వైఖరి తీసుకుంది. 1969 ఉద్యమం తర్వాత నిధులన్నీతెలంగాణకే వెళ్తున్నాయి. ఆంధ్రులకు ఆంధ్రప్రదేశ్ లో భవిష్యత్తు లేదు ”అనే విషయాలు బాగా ప్రచారమై ప్రజల్లో తెలంగాణ వ్యతిరేకత పెరిగి ఆందోళనలకు నిప్పు రాజేశాయని హరగోపాల్ అన్నారు.

దానికి తోడు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి.1972 సెప్టెంబర్ నాటికి ఇది రాష్ట్ర రాజకీయ, వాతావరణ పరిస్థితి.

ఇదే సమయంలో సుప్రీంకోర్టు ముల్కీ నియమాల మీద హైకోర్టు తీర్పును కొట్టి వేస్తూ ఈ నియమాలను తెలంగాణలో అమలు చేయడాన్ని సమర్థిస్తూ, 1972 అక్టోబర్ 3న తీర్పునిచ్చింది. ఆంధ్రలో విద్యార్థులకు, ఉద్యోగులకు ఇది ఆగ్రహం తెప్పించింది.

సమైక్యాంధ్ర కావాలనుకుంటే ముల్కీ రూల్స్ ని రద్దు చేయాల్సిందేనని పట్టుబట్టారు. భారతీయ జనసంఘ్, స్వతంత్ర పార్టీలు ఈ డిమాండ్ ను సమర్థించాయి.

కాంగ్రెస్ లో హైకమాండ్ మీద గుర్రుగా ఉన్నవాళ్లు కూడా వీళ్లతో చేతులు కలిపారు. పీవీ నరసింహారావు భూ సంస్కరణలను వ్యతిరేకిస్తున్నవాళ్లు వీళ్లకు తోడయ్యారు.

దీనితో కాంగ్రెస్ లో కూడా ఆంధ్ర, తెలంగాణ విభేదాలు తీవ్రమయ్యాయి.

అక్టోబర్ 25న ఏలూరులో ఒక సభలోప్రసంగిస్తూ సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయక తప్పదని ముఖ్యమంత్రి ప్రకటించడం తీవ్ర అసంతృప్తిని రాజేసింది.

అంతే, విద్యార్థులు ఈ సమావేశం తర్వాత ఒక కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేశారు. వాళ్ల డిమాండ్ కేవలం కేవలం 'ముల్కీ రూల్స్ రద్దుచేయాలి,’ అని మాత్రమే.

ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర డిమాండ్ కేవలం జనసంఘ్, స్వతంత్ర పార్టీలు మాత్రమే చేస్తూ వస్తున్నాయి. ఈ ఉద్రిక్త పరిస్థితులలో విజయవాడలో తొలి కోస్తాంధ్ర నిరసన సభ జరిగింది.

తెలంగాణ విషయంలో అసంతృప్తి

లాయర్లు ఆంధ్రా ప్రాంతంలో హైకోర్టు కావాలన్నారు. ఆంధ్ర ప్రాంతంలో ని ఆసుపత్రులకు నిధులీయడంలేదని, హైదరాబాద్ ఆసుపత్రుల మీద శ్రద్ధ ఎక్కువగా చూపిస్తున్నారని, తమకు ఉన్న రెండేళ్ల ప్రొబేషన్ తెలంగాణలో లేదని, ఇది వివక్ష అని డాక్టర్లు అన్నారు.

మునిసిపల్ టాక్స్ విషయంలో కూడా వివక్ష ఉందని కౌన్సిలర్లు చెప్పారు. నిధుల పంపకం మీద గణాంకాలతో సహా వివరాలు బయటకు వచ్చాయి.

సమైక్య రాష్ట్రంలో ఆంధ్ర మునిగిపోతున్నదన్న భావన బలపడింది. ఆంధ్ర సెటిలర్స్ భూములను తెలంగాణలో గుంజుకుంటారనే ప్రచారం మొదలయింది. ఈ ప్రచారాలతో రాష్ట్రమంతా ఆందోళనలు మొదలయ్యాయి.

ఇందిరా గాంధీ రాజీసూత్రం

నవంబర్ 21న ఆందోళనకారుల మీద పోలీసులు కాల్పులు జరిపారు. ఒంగోలులో 9 మంది, ఆదోనిలో ఇద్దరు, తెనాలిలో ఆరుగురు చనిపోయారు. నవంబర్ 27న ప్రధాని ఇందిరాగాంధీ అయిదు సూత్రాల రాజీ పథకం ప్రకటించారు.

ముల్కీ నియమాలను కేవలం నాన్ గెజిటెడ్ ఉద్యోగాలకే వర్తింప చేస్తామని, హైదరాబాద్ పోలీస్ శాఖలో అన్ని ప్రాంతాలకు ప్రాధాన్యం ఉంటుందనేవి కూడా ఇందులో ఉన్నాయి.

ఇది కూడా తెలంగాణకు అనుకూలంగానే ఉన్నట్లు ఆంధ్రా నేతలు భావించారు.

ఇందిరా గాంధీ జోక్యంతో ఆంధ్రా కాంగ్రెస్ నేతలు కొంచెం దిగి వచ్చినా, ఆంధ్రా ఎన్జీవోలు మాట వినలేదు. నవంబర్ 30న వారు ప్రధాని రాజీసూత్రాన్ని తిరస్కరించారు. ముల్కీ రూల్స్ ని రద్దు చేయాల్సిందే అన్నారు.

అటువైపు తెలంగాణ ఎన్జీవోలు కూడా ప్రతిపాదనలను తిరస్కరించి ముల్కీ రూల్స్ ని పూర్తిగా అమలు చేయాల్సిందేనని పట్టుబట్టారు. పరిస్థితి ఉద్రిక్తమయింది. డిసెంబర్ 7న ఆంధ్రా ఎన్జీవోలు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు.

ప్రధాని రాజీ సూత్రానికి చట్టబద్ధత కల్పించే విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉప ముఖ్యమంత్రి బీవీ సుబ్బారెడ్డి, వ్యవసాయ మంత్రి కాకాని వెంకటరత్నం, మరొక ఏడుగురు మంత్రులు రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు.

ప్రత్యేకాంధ్ర డిమాండ్ పుట్టుక

జై ఆంధ్ర ఉద్యమంలో 1972 డిసెంబర్ 10 అంత్యంత కీలకమయిన తేదీ. ముల్కీ వ్యతిరేక ఉద్యమం ప్రత్యేకాంధ్ర ఉద్యమంగా మారింది ఈ తేదీనే.

ఆ రోజున విజయవాడలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. కాంగ్రెస్, జనసంఘ్, స్వతంత్రపార్టీ , తెన్నేటి విశ్వనాథం వంటి ఇండిపెండెంటు సభ్యులు కూడా సభకు వచ్చారు.ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ తొలిసారి బయటపడింది ఇక్కడే.

చాలా స్పష్టంగా ప్రత్యేకాంధ్ర రాష్ట్ర ఏర్పాటు చేయాలని కోరుతూ సభలో తీర్మానం చేశారు. స్వతంత్ర పార్టీ నేత గౌతు లచ్చన్న తయారు చేసిన ప్రత్యేకాంధ్ర రాష్ట్ర పతాకాన్ని ఎగుర వేశారు.

పసుపుపచ్చ నేపథ్యంలో తెల్లటి ఆంధ్ర మ్యాప్ తో ఈ జెండా రూపొందించారు. దీనితో ఉద్యమం కొత్త మలుపు తిరిగింది.

లచ్చన్న జెండా ఇళ్ల మీద, కూడళ్లలోనే కాదు, ప్రభుత్వ కార్యాలయాల మీద కూడా ఎగరేసేవారని, ఈ సమావేశం తర్వాతే, ఉద్యమం నాలుగు కోస్తా జిల్లాల నుంచి ఇతర జిల్లాలకు విస్తరించిందని ఉద్యమాన్ని రికార్డు చేసిన హ్యూ గ్రే రాశారు.

అయితే, సీపీఐ, సీపీఎం తో పాటు, కాంగ్రెస్ లో ని ఒక వర్గం సమైక్యాంధ్రనే సమర్థిస్తూ వచ్చాయి. డిసెంబర్ 17న ఉపముఖ్యమంత్రి బీవీ సుబ్బారెడ్డి, వ్యవసాయమంత్రి కాకాని వెంకటరత్నం విజయవాడలోని ఒక బహిరంగ సభలో ప్రత్యేక ఆంధ్ర ఉద్యమానికి మద్దతు ప్రకటించారు.

డిసెంబర్ 19న పీవీ నరసింహారావు క్యాబినెట్ నుంచి 9 మంది ఆంధ్రా మంత్రులు రాజీనామా చేశారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం తప్ప మరొకటి తమకు సమ్మతి కాదని ప్రకటించారు.

అయితే, ఇందిరాగాంధీ మాత్రం తన సమైక్య ధోరణి మార్చుకోలేదు.

ఆంధ్ర ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులున్నా డిసెంబర్ 21న ప్రధాని రాజీ సూత్రాన్ని పొందుపరిచి రూపొందించిన మూల్కీ రూల్స్ బిల్లు లోక్ సభ లో పాసయింది. 233 మంది దీనిని సమర్థించారు. 40 మంది వ్యతిరేకించారు.

డిసెంబర్ 24 మరొక ముఖ్యమైన తేదీ. ఇది చాలా విషాదాన్ని నింపిందని వడ్డే శోభనాద్రీశ్వరరావు చెప్పారు. ఆయన ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. అంతేకాదు 1972 ఎన్నికల్లో ఉయ్యూరు నుంచి కాకాని వెంకటరత్నం మీద పోటీ చేసి ఓడిపోయారు. ఆ రోజు ఏమి జరిగిందో వడ్డేశోభనాద్రీశ్వరరావు వివరించారు.

''సీపీఐ ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర ఊరేగింపు జరిగింది. దీనిని అడ్డుకునేందుకు ప్రత్యేకాంధ్ర ఆందోళనకారులు ప్రయత్నించారు. ఘర్షణ జరిగింది. ఇళ్ల మీది నుంచి ప్రత్యేకాంధ్ర ఆందోళనకారులు సీసాలు రాళ్లు రువ్వారు. పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. చివరకు కాల్పులు జరిపారు. ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. ఎవరో కాంగ్రెస్ మంత్రి సమైక్యాంధ్ర సభలో ప్రసంగించేందుకు ప్రత్యేక విమానంలో వస్తున్నారని వదంతి వ్యాపించింది. ఆ విమానం రాకుండా ఆందోళనాకరులు విజయవాడ ఎయిర్ పోర్టు రన్ వే మీద బైఠాయించారు’’ అని వడ్డే శోభనాద్రీశ్వరరావు గుర్తు చేసుకున్నారు.

విజయవాడ రోడ్లన్నింటిని దిగ్భంధం చేశారు, ప్రత్యేకాంధ్ర సభ కొనసాగించాలని కాకాని వెంకటరత్నం ప్రయత్నించారు. కానీ, విఫలయ్యారు. డిసెంబర్ 25న కాకాని వెంకటరత్నం గుండెపోటుతో చనిపోయారు.

దీనికి కారణం, విజయవాడ పోలీసుల కాల్పులేనని, అమాయకులు ప్రాణాలు పోవడంతో ఆయన తీవ్ర మానసిక క్షోభకు గురయ్యారని, గుండెపోటు దీని ఫలితమేనని నాటి ఉద్యమంలో పాల్గొన్నశోభనాద్రీశ్వరరావు చెప్పారు.

కాకాని అంతిమయాత్రకు సుమారు నాలుగయిదు లక్షలమంది హాజరయ్యారని చెబుతూ, బాగా జనాదరణతోపాటు మంచి నాయకత్వ లక్షణాలు ఉన్ననాయకుడు కాకాని అని శోభనాద్రీశ్వరరావు అన్నారు.

ఆయన నాయకత్వం కొనసాగి ఉంటే ఉద్యమం ప్రత్యేకాంధ్రను ఆ రోజే సాధించి ఉండేదేమోనని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.

తర్వాత ఉద్యమ నాయకత్వం రాయలసీమ ప్రాంతానికి చెందిన బీవీ సుబ్బారెడ్డి తీసుకున్నారు. 1972 డిసెంబర్ 31న తిరుపతిలో 100 మంది ఆంధ్రా శాసన సభ్యులు సమావేశమై ఆంధ్రా బంద్ కి , పన్నుల నిరాకరణ కు పిలుపునిచ్చారు.

అప్పటికే ఉద్యమంలో సుమారు 34 మంది చనిపోయారు. 1973 జనవరి 2న మొదటి ఆంధ్రా బంద్ జరిగింది. ప్రత్యేకాంధ్ర రాష్ట్రం ఏర్పడే దాకా ఉద్యమం కొనసాగిస్తామని ఎన్జీవోలు ప్రకటించారు.

రాష్ట్ర కాంగ్రెస్ లో ఏమాత్రం మద్దతు లేని పీవీ నరసింహారావు ప్రతిచిన్న విషయానికి ప్రధాని సలహా కోసం ఎదురు చూస్తూ కూర్చుంటూ ఉద్యమాన్ని అదుపు చేయలేక పోయారు.

జనవరి 18న రాష్ట్రపతి పాలన విధించారు. గవర్నర్ ఖండూభాయ్ దేశాయ్ చేతికి పగ్గాలు వచ్చాయి.

ఉద్యమం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో జనవరి 23న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నేతలు పార్టీకీ రాజీనామా చేస్తూ బీవీ సుబ్బారెడ్డికి లేఖలు సమర్పించారు. ఫిబ్రవరి 5 లోపు రాష్ట్ర విభజన జరగాలని గడువు విధించారు.

మధ్యలోనే ఆగిపోయిన ఉద్యమం

ఉద్యమం ఇంత అల్టిమేటమ్ ఇచ్చే స్థాయికి ఎదిగి ఒక్కసారి నీరు కారడం మొదయింది. ఈ ఉద్యమానికి కేంద్రం ఏ మాత్రం జంకలేదు. జనవరి 24న ప్రధాని ఇందిరాగాంధీ ఆంధ్ర కాంగ్రెస్ నేతలను తీవ్రంగా తప్పు పట్టారు.

ఆ రోజు నుంచి మార్చి 25 దాకా కేంద్రం ప్రతి రోజు ఏదో ఒక రూపంలో రాష్ట్ర విభజన చేసేది లేదని పునరుద్ఘాటిస్తూ వచ్చింది. ఫిబ్రవరి 25 కేంద్ర హోంమంత్రి కేసీ పంత్ రాష్ట్ర విభజన డిమాండ్ ను పార్లమెంటులో తోసిపుచ్చారు.

ఇలా కేంద్ర తిరస్కారాల మధ్య డిసెంబర్ 7 నుంచి మొదలుపెట్టిన తమ సమ్మెను (108రోజులు)ఆంధ్ర ఎన్జీవోలు మార్చి 25న విరమించుకున్నారు.

ప్రధాని ఇందిరా గాంధీతో, తెలంగాణ, ఆంధ్రా కాంగ్రెస్ సంపద్రింపులు మొదలయ్యాయి. ఉద్యమం ఆగిపోయింది. రాష్ట్రపతి పాలన మరొక ఆరు నెలలు కొనసాగించారు.

ఉద్యమానికి నిధుల కొరత ఎదురయింది. ఆందోళనాకారుల్లో అలసట వచ్చింది. కాంగ్రెస్ నేతలు చర్చల్లో మునిగి పోవడంతో ఉద్యమానికి నాయకత్వం లేకుండా పోయింది.

సీపీఐ, సీపీఎం మద్దతు లేకపోవడం ట్రేడ్ యూనియన్ల నుంచి సహకారం లేకుండా పోయింది.

చివరకు కేసీ పంత్ మరొక కొత్త ఫార్ములాతో ముందుకు వచ్చారు. ఉద్యోగులకు, ఉద్యోగాలకు భద్రతతో పాటు, ఇందులో కొత్త అంశం సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు మాత్రమే.

ప్రత్యేకాంధ్ర ప్రధాన డిమాండ్ మాయమైంది. ఉద్యమం చల్లారింది.

1973 డిసెంబర్ 10న 11 నెలల తర్వాత రాష్ట్రపతి పాలన ఎత్తేశారు. ఎవరికీ ఇష్టంలేని పీవీ నరసింహారావును తొలగించి ముఖ్యమంత్రిగా జలగం వెంగళరావు ను ఇందిరాగాంధీ నియమించారు.

పవర్ స్ట్రగుల్ ప్రజా ఉద్యమం ఎలా అయింది?

రాజకీయాధికారం కోసం, అస్థిత్వం కోసం సాగుతున్న జై ఆంధ్ర ఉద్యమంలో విద్యార్థులు, ఉద్యోగులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొనేందుకు రెండు కారణాలున్నాయని ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన రాజనీతి శాస్త్ర మాజీ ఆచార్యులు ప్రొ. కె.శ్రీనివాసులు అన్నారు.

“ముల్కీ నియమాల వల్ల పెద్దగా నష్టపోయేందుకు వీలులేదు. ఎందుకంటే అపుడు ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగాలే తక్కువ. ఇవి కేవలం కింది స్థాయికే వర్తిస్తాయి. ప్రభుత్వ యంత్రాంగం కూడా ఇంకా విస్తరించలేదు. అయితే, 1918లో తయారైన ముల్కీరూల్స్ అని వాటిని భూతంగా చూపించారు. ఇదొక కారణమయితే, రెండోది రాష్ట్రంలో పెరుగుతున్న విద్యావంతుల సంఖ్య. ఆంధ్రప్రదేశ ఏర్పడిన తర్వాత కాలేజీల ఏర్పాటు పెరిగింది. గ్రాడ్యుయేట్లు తయారు కావడం ఎక్కువయింది. వీళ్లకి ఉద్యోగాలు కావాలి. ఇది నిజమయిన సమస్య. ఈ నేపథ్యంలో ముల్కీ రూల్స్ ఉంటే అసలు ఉద్యోగాలు రావు, ప్రమోషన్లు కష్టమనే భయం సులభంగా సృష్టించారు. అందుకే విద్యార్థులు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు” అని ఆయన అన్నారు.

ఆ రోజు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఉద్యమాన్ని ఎం. వెంకయ్య నాయుడు, రాయలసీమకు చెందిన ఆగస్టీన్ అగ్రభాగాన ఉండి నడిపించారు.

జై ఆంధ్రా ఉద్యమం పూర్తిగా పవర్ స్ట్రగుల్ మాత్రమేనని, వ్యవసాయంలో వచ్చిన మిగులుతో క్యాపిటలిస్టు వర్గంగా మారుతున్న కొన్ని సామాజిక వర్గాలు చేసిన ఆందోళన మాత్రమేనని ఆంధ్రవిశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్స్ లర్ కేఎస్ చలం అన్నారు.

“ఆంధ్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత అన్ని సామాజిక వర్గాలు అస్థిత్వం కోసం పోరాడతాయి. అస్థిత్వం రాజకీయాధికారం కోసం సాగుతుంది. నాటి ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం,1956 ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు, 1969 తెలంగాణ ఉద్యమం లాగానే, జై ఆంధ్రా ఉద్యమం కూడా రెండు కులాలు తమ అస్థిత్వం, ఆపైన అధికారం కోసం నడిపించిన ఉద్యమాలు. ఇది రాష్ట్ర ప్రయోజనాల కోసం నడిచిన ఉద్యమం కాదు. దీనికి ఉద్యోగాలు, ముల్కీ వ్యతిరేకత అనే సమస్యను జోడించడంతో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ఈ ఉద్యమంలో త్యాగాలు చేసింది, ప్రాణాలు పొగొట్టుకున్నది వెనకబడి వర్గాల వాళ్లు, లబ్ధి పొందింది భూములున్నకులాల వాళ్లు” అని ప్రొఫెసర్ చలం అన్నారు.

ప్రొఫెసర్ చలం కూడా ఉద్యమం కాలంలోఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఉన్నారు. అయితే, ఉద్యమంలో భాగంగా ఉంటూనే ఆయన ఉత్తరాంధ్ర వేదిక ఏర్పాటు చేసి ఈ ప్రాంత హక్కుల కోసం క్యాంపెయిన్ చేశారు.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ రాజనీతి శాస్త్ర అసోసియేట్ ప్రొఫెసర్ ఇ.వెంకటేశు దాదాపు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.

“ఉద్యమకాలం నాటికి ఆంధ్ర నుంచి హైదరాబాద్ కు పెట్టుబడులు రావడం ఇంకా ఊపందుకోలేదు.. జై ఆంధ్ర ఉద్యమాన్ని ప్రత్యేకాంధ్ర ఉద్యమంగా కొనసాగించి, రాష్ట్ర విభజన సాధించి ఉంటే హైదరాబాద్ లో ఆంధ్రుల పెట్టుబడి కేంద్రీకృతమై ఉండేది. అది ఆంధ్ర రాష్ట్రానికి ఉపయోగపడి ఉండేది. అలా కాకుండా ఉద్యమానికి నాయకత్వం వహించిన కులాలు తమ ప్రయోజనాలు కాపాడుకోవడం మీద శ్రద్ధ చూపించి కేంద్రంతో బేరసారాలడాయి. బేరం కుదరగానే ఉద్యమాన్ని ఆపేశాయి. అందుకే ఉద్యమంలోపాల్గొన్న అశేష ప్రజానీకానికి ప్రయోజనమేమీ కలగ లేదు,” అని ప్రొఫెసర్ వెంకటేశు అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
50 years for Jai Andhra movement,what made this movement erupt
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X