Weather: రేపు ఏపీలో ఇక్కడ వర్షాలు- అక్కడ వడగాల్పులు..!
నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) ప్రవేశిస్తున్న వేళ ఏపీలో మిశ్రమ వాతావరణ (Weather) పరిస్ధితులు కొనసాగుతున్నాయి. రేపు కూడా దాదాపు ఇలాంటి పరిస్ధితులే ఉండొచ్చని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేస్తోంది.
మరో మూడు రోజులు పిడుగులతో కూడిన వర్షాలు, కొన్నిచోట్ల ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ తెలిపారు. అలాగే రాష్ట్రంలో ఎక్కడెక్కడ వర్షాలు పడతాయో, ఎండలు కాస్తాయో కూడా అంచనాలను వెల్లడించారు.
వాతావరణ శాఖ తాజా సూచనల ప్రకారం శనివారం (06-06-2026) పోలవరం, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, మార్కాపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు* కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.ఆకస్మికంగా ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల క్రింద, విద్యుత్ స్తంబాలు, హోర్డింగ్స్ క్రింద నిలబడొద్దని సూచించారు.

పొలాల్లో పనిచేసే రైతులు, పశుకాపరులు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు. వర్షపు గాలుల వల్ల ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపడి ఉంటే వాటిని గమనిస్తూ, వాటికి వీలైనంత దూరంగా ఉండాలన్నారు. మరోవైపు రేపు శ్రీకాకుళం జిల్లాలో 11 మండలాలు, విజయనగరం 20, మన్యం 14, అల్లూరి1, పోలవరం 2, కాకినాడ 8 మొత్తంగా *56 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 51 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.












Click it and Unblock the Notifications