ఏపీపై ఉపరితల ఆవర్తనం- నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
ఈ నెల 4న కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తోన్నాయి. వీటి ప్రభావంతో దేశంలోని పలు ప్రాంతాల్లో వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటోన్నాయి. కేరళ తీరాన్ని తాకిన అనంతరం మరింత బలపడుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాలకు వేగంగా విస్తరిస్తోన్నాయి. ఫలితంగా ఏపీ సహా దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
రుతుపవనాల ప్రభావంతో నేడు ఏపీతో పాటు కేరళ, కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. సుమారు 7 నుంచి 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదు కావచ్చని అంచనా. మరోవైపు, తమిళనాడులో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని నిపుణులు పేర్కొన్నారు. తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు మరియు లోతట్టు ప్రాంతాల వారు వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఉరుములు, మెరుపులతో కూడిన సమయాల్లో ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని ఐఎండీ సూచించింది. చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని పేర్కొంది. సముద్రం మీదుగా వీచే బలమైన గాలులు, అలల తీవ్రత దృష్ట్యా, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర తీరాల్లో జాలర్లు వేటకు వెళ్లకూడదని కఠిన హెచ్చరికలు జారీ చేశారు. రుతుపవనాలు వేగంగా విస్తరించడానికి అనుకూల వాతావరణం నెలకొని ఉన్నందున సముద్రం అల్లకల్లోలంగా ఉండొచ్చని సూచించింది.
మరోవైపు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేడు ఏపీలో పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. పోలవరం, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన జల్లులు పడొచ్చని వివరించింది.












Click it and Unblock the Notifications