Success Story: పదో తరగతే చదువు.. ఏడాదికి 5 కోట్ల సంపాదన: ఈ రైతు సక్సెస్ సీక్రెట్ ఇదే!
Success Story: ఈ రోజుల్లో చాలా మంది యువత ఉద్యోగం చేయడానికి బదులుగా సొంత వ్యాపారం ప్రారంభించాలని లేదా సొంతంగా పని చేసుకోవాలని కోరుకుంటున్నారు. మధ్యప్రదేశ్‌లోని హర్దా జిల్లాకు చెంది రైతు మధుసూదన్ ధాకడ్ స్టోరీ కూడా అలాంటి వారికి స్ఫూర్తిదాయకం. రైతు మధుసూదన్ కేవలం పదో తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. కానీ వ్యవసాయంలో కొత్త పద్ధతులను అవలంభించి ఏటా కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు.
మధుసూదన్ రైతు కుటుంబానికి చెందినవాడు. చిన్నప్పటి నుంచే వ్యవసాయంతో అనుబంధం కలిగి ఉన్నాడు. మొదట్లో ఆయన సాంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం చేశాడు. కానీ ఆశించినంత ఆదాయం రాలేదు. అనంతం ఆయన తన వ్యవసాయ పద్ధతిని మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు . వ్యవసాయం, నర్సరీల ద్వారా ఆయన ఏటా సుమారు రూ. 5 కోట్లు సంపాదిస్తున్నాడు.

మధుసూదన్ ధాకడ్ గోధుమ వంటి సాంప్రదాయ పంటలకు బదులుగా వెల్లుల్లి, పచ్చి మిరపకాయలు, క్యాప్సికమ్, టమాటాలు, అల్లం వంటి అధిక విలువ గల పంటలపై దృష్టి పెట్టడం ప్రారంభించాడు. ఆధునిక పద్ధతుల సహాయంతో ఆయన క్రమంగా తన వ్యవసాయాన్ని విస్తరించి నేడు సుమారు 200 ఎకరాల్లో సాగు చేస్తున్నాడు.
వ్యవసాయంతో పాటు నర్సరీ ప్రారంభం
మధుసూదన్ కేవలం పంటలు పండించడానికే పరిమితం కాలేదు. ఆయన తన సొంత నర్సరీని కూడా ప్రారంభించారు. దీని ద్వారా ప్రతి సంవత్సరం సుమారు 20 లక్షల మొక్కలు ఉత్పత్తి అవుతున్నాయి. వ్యవసాయం, నర్సరీ ద్వారా ఆయన వార్షిక ఆదాయం సుమారు రూ.5 కోట్లకు చేరుకుంది. సరైన పంటను ఎంచుకోవడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించడం, మంచి యాజమాన్యం ద్వారా గణనీయమైన ఆదాయాన్ని పొందవచ్చని ఆయన విజయం నిరూపిస్తుంది.
ఏ పంట నుంచి ఎంత ఆదాయం వస్తుంది?
*మధుసూదన్ 40 ఎకరాల భూమిలో పచ్చి మిరపకాయలు సాగు చేశాడు. దీనికి ఆయనకు ఎకరానికి సుమారు 70,000 రూపాయలు ఖర్చయింది. ఆయనకు ఎకరానికి సుమారు 150 నుంచి 200 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది.
*అదేవిధంగా ఆయన ఎకరానికి సుమారు రూ.లక్ష పెట్టుబడి పెట్టి 25 ఎకరాల్లో క్యాప్సికమ్ పండించి, ఎకరానికి 300 నుంచి 400 క్వింటాళ్ల దిగుబడిని సాధించాడు.
*మధుసూదన్ 50 ఎకరాల్లో టమాటాలు కూడా సాగు చేశాడు. ఆయన ఎకరానికి సుమారు లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టాడు.ఆయన ప్రకారం, ఎకరానికి దిగుబడి 1,000 నుంచి 1,200 క్వింటాళ్ల వరకు ఉండగా, దీని ద్వారా ఎకరానికి సుమారు 3 లక్షల రూపాయల ఆదాయం సమకూరింది.
*ఇది కాకుండా ఆయన 15 ఎకరాల్లో వెల్లుల్లిని కూడా సాగు చేశాడు, దీనివల్ల ఆయన ఆదాయం మరింత పెరిగింది.
అన్నదాతలకు ఆదర్శంగా నిలుస్తున్న మధుసూదన్
వ్యవసాయం తన రక్తంలోనే ఉందని, అయితే కాలానికి అనుగుణంగా వ్యవసాయ పద్ధతులను మార్చుకోవడం చాలా అవసరమని మధుసూదన్ ధాకడ్ అంటారు. ఆయన ప్రకారం మారుతున్న ప్రపంచంతో పాటు ముందుకు సాగాలంటే కొత్త సాంకేతికతను, కొత్త పద్ధతులను అవలంబించడం అత్యవసరం. విద్య ముఖ్యమే అయినా విజయానికి కేవలం డిగ్రీ మాత్రమే సరిపోదని ఆయన నమ్ముతారు. ఓ వ్యక్తి కష్టపడి పనిచేస్తూ, సరైన టెక్నాలజీని ఉపయోగిస్తూ కాలానికి అనుగుణంగా మారుతూ.. ఒక దార్శనికతను కలిగి ఉంటే, వారు వ్యవసాయం ద్వారా గొప్ప విజయాన్ని సాధించగలరు .













Click it and Unblock the Notifications