వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి... వారిపై సీఎం రేవంత్ ఆగ్రహం, డెడ్ లైన్!
ఉత్తర తెలంగాణాకు తలమానికం అయిన వరంగల్ జిల్లాలో నిర్మాణం అవుతున్న వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం వేగంగా జరగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వచ్చే 30 రోజుల పాటు రోజుకు 24 గంటలు పని జరపాలని లక్ష్యం పెట్టారు. నిధులు ఇస్తున్నా పనుల్లో వేగం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు.
సోమవారం హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో వైద్య ఆరోగ్య, పురపాలక శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు విడుదలైనా పనుల్లో జాప్యం జరుగుతోందని, పట్టింపు లేనట్టు ఉందని సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎంవో అధికారులు నిరంతరం క్షేత్రస్థాయికి వెళ్లి పర్యవేక్షించాలని, ప్రతి పనికి ప్రత్యేక అధికారిని బాధ్యతగా నియమించాలని చెప్పారు.

రోజూ కలెక్టర్ ఆసుపత్రి పనులను చూసుకోవాలన్నారు. డిసెంబర్ లో ప్రారంభించుకునేలా అన్ని ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన జరగాలని సీఎం అధికారులను ఆదేశించారు. సనత్‌నగర్ టిమ్స్ తరహాలో ఓపీ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని, స్టాఫ్ క్వార్టర్స్ నిర్మాణం వెంటనే ప్రారంభించాలని సూచించారు. ఆసుపత్రి నిర్వహణను ఏజెన్సీకి అప్పగించాలన్నారు.
తెలంగాణాలో హైదరాబాద్ తర్వాత వరంగల్ అభివృద్ధికి తెలనానా ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వరంగల్ నగర సమగ్రాభివృద్ధిపై కూడా దృష్టి సారించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భూగర్భ డ్రైనేజీ పనులు పకడ్బందీగా పూర్తి చేయాలని, బాహ్య వలయ రహదారి, ఖమ్మం-వరంగల్-కరీంనగర్ రోడ్ల అనుసంధానంపై ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
విమానాశ్రయం ప్రారంభం నాటికి ఈ పనులు పూర్తి కావాలని ఆదేశించారు. హైదరాబాద్ తరహాలో వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయాలని, భద్రకాళి, రామప్ప ఆలయాల పర్యాటకం, భారీ బస్ టెర్మినల్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంపీ వేం నరేందర్ రెడ్డి, వికాస్ రాజ్, శ్రీధర్, క్రిస్టినా జె.చోంగ్తూ, మాణిక్ రాజ్, టీకే శ్రీదేవి, కలెక్టర్లు సత్యశారద దేవి, చాహత్ బాజ్‌పాయ్ తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications
