అబార్షన్ పిల్‌కి.. ఎమర్జెన్సీ పిల్‌కి తేడా ఏంటి? ఆ అలవాటు ఉందా?
ఆడవారి ఆరోగ్యానికి శ్రీరామరక్షగా భావించే అత్యవసర గర్భనిరోధక మాత్రల (Morning-After Pills) వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. 'ఇవి కేవలం అత్యవసర వేళల్లో వాడటానికి మాత్రమే.. రోజూ వాడే క్రమబద్ధమైన మాత్రలు కావు' అని స్పష్టం చేసే హెచ్చరికలను ఇకపై ప్యాకెట్లపై స్పష్టంగా ముద్రించాలని భావిస్తోంది. ఈ మాత్రలు అబార్షన్ కు ఉపయోగపడవని, అలాగే హెచ్‌ఐవీ లేదా ఇతర లైంగిక సంబంధిత ఇన్ఫెక్షన్ల నుంచి ఎలాంటి రక్షణ ఇవ్వవని తేల్చి చెప్పడమే ఈ ప్రతిపాదన ముఖ్య ఉద్దేశం. భయపెట్టడం కాకుండా, సరైన అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కొత్త మార్గదర్శకాలు రూపుదిద్దుకుంటున్నాయి.
అసలు ఈ మాత్ర ఎలా పనిచేస్తుందంటే..?
లెవోనోర్‌జెస్ట్రెల్ (Levonorgestrel) అని పిలిచే ఈ అత్యవసర మాత్రలు శరీరంలో అండాశయం నుంచి గుడ్డు విడుదలయ్యే క్రమాన్ని (Ovulation) కొంతకాలం వాయిదా వేస్తాయి. దీనివల్ల గర్భం దాల్చే అవకాశం తగ్గుతుంది. అయితే ఇప్పటికే గర్భం దాల్చి ఉంటే మాత్రం ఇది పనిచేయదు. అంటే ఇది అబార్షన్ మాత్ర ఎంతమాత్రమూ కాదు. సురక్షితం కాని కలయిక జరిగిన ఐదు రోజుల్లోపు (120 గంటలు) ఈ మాత్ర వాడితే 95 శాతానికి పైగా గర్భాన్ని నివారించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) స్పష్టం చేస్తోంది.

ఆలస్యం అమృతం విషం
అత్యవసర గర్భ నిరోధక మాత్రల విషయంలో అత్యంత కీలకమైన అంశం సమయం. ఎంత త్వరగా తీసుకుంటే అంత మెరుగైన ఫలితం ఉంటుంది. కాండోమ్ చిరిగిపోవడం, క్రమం తప్పకుండా వాడే గర్భనిరోధక మాత్రలను మరచిపోవడం లేదా అనుకోని పరిస్థితుల్లో లైంగిక దాడికి గురైనప్పుడు ఈ మాత్రలు కొండంత అభయాన్ని ఇస్తాయి. కానీ, 'ఆ తర్వాత తీసుకుందాంలే' అని ఆలస్యం చేసే కొద్దీ వీటి సామర్థ్యం క్రమంగా తగ్గుతూ వస్తుంది.
తరచూ వాడితే ఏమవుతుంది?
సమస్యల్లా ఈ మాత్రలను క్రమం తప్పకుండా అలవాటుగా మార్చుకోవడంతోనే వస్తుంది. నెలసరి చక్రంలో ఒకటికి రెండుసార్లు వాడటం వల్ల తక్షణమే పెను ప్రమాదాలు రాకపోవచ్చు కానీ, నెలసరి క్రమం తప్పుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ మాత్రలు వాడిన వారిలో దాదాపు 21 శాతం మందికి తదుపరి నెలసరి వారం రోజులకు పైగా ఆలస్యమైనట్లు ఆధారాలు ఉన్నాయి. అంతేకాకుండా కడుపులో తిప్పడం, తలతిరగడం, తలనొప్పి, రొమ్ముల్లో నొప్పి, నెలసరి మధ్యలో బ్లీడింగ్ కావడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
అలవాటుగా మార్చుకోకండి!
భారతదేశంలో చేసిన అధ్యయనాల ప్రకారం అత్యవసర మాత్రలను పదే పదే వాడే వారి సంఖ్య 12 నుంచి 69 శాతం వరకు ఉందని తేలింది. దీన్ని బట్టి వీటిని చాలామంది సాధారణ గర్భనిరోధక సాధనంగా పప్పుబెల్లాల్లా వాడుతున్నారని అర్థమవుతోంది. ఇది ఆరోగ్యానికి ఎంతమాత్రమూ మంచిది కాదు. ఒకసారి మాత్ర వేసుకున్నంత మాత్రాన ఆ తర్వాత జరిపే కలయికలకు రక్షణ ఉంటుందనుకోవడం పొరపాటు. పదే పదే ఈ మాత్రలపై ఆధారపడే బదులు, సురక్షితమైన సాధారణ గర్భనిరోధక పద్ధతులను ఎంచుకోవడమే శ్రేయస్కరం.
పాటించాల్సిన ముఖ్య సూత్రం
ఈ కొత్త మార్గదర్శకాల ఉద్దేశం 'మాత్రలు అసలే వాడొద్దు' అని చెప్పడం కాదు. "అవసరమైనప్పుడు కచ్చితంగా వాడండి.. వీలైనంత త్వరగా తీసుకోండి.. కానీ, అత్యవసర మాత్రను దినచర్యగా మార్చుకోకండి" అని చెప్పడమే. ఒకవేళ మాత్ర వాడిన తర్వాత కూడా నెలసరి చాలా రోజులు ఆలస్యమైతే లేదా శరీరంలో ఏవైనా తేడాలు అనిపిస్తే వెంటనే గర్భ నిర్ధారణ పరీక్ష చేసుకోవడంతో పాటు వైద్యులను సంప్రదించడం మంచిది














Click it and Unblock the Notifications
