హరిద్వార్ లో తీవ్ర విషాదం- 6 మంది భక్తులు దుర్మరణం: మృతుల సంఖ్య మరింత?
దేవభూమిగా గుర్తింపు తెచ్చుకున్న ఉత్తరాఖండ్ లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఈ ఉదయం చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఆరుమంది భక్తులు దుర్మరణం పాలయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉండటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమౌతోన్నాయి.

సమాచారం అందిన వెంటనే జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ బలగాలు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందిస్తోన్నారు.
ఈ తొక్కిసలాట ఘటనను ఘర్వాల్ డివిజన్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే.. ధృవీకరించారు. హుటాహుటిన ఆయన సంఘటన స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షిస్తోన్నారు. స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొంటోన్నారు. మృతుల సంఖ్యను తగ్గించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తోన్నామని అన్నారు.
హరిద్వార్ ఎస్ఎస్పీ ప్రమేంద్ర దోబాల్ స్వయంగా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. సిబ్బందికి తగిన ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య చికిత్సల గురించి ఆరా తీస్తోన్నారు. ఎప్పటికప్పుడు గాయపడ్డ వారి సంఖ్య పెరుగుతోండటం ఆందోళనకు గురి చేస్తోంది.
ఉత్తరాఖండ్ హరిద్వార్ లోని మనసా దేవి ఆలయంలో ఈ ఉదయం ఈ తొక్కిసలాట సంభవించింది. ఈ నెల 23న జలాభిషేకం జరిగిన తర్వాత కూడా హరిద్వార్‌కు లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. శని, ఆదివారాలు కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. ప్రమాదం జరిగిన ప్రాంతం చాలా ఇరుకుగా ఉండటం.. రద్దీ అధికంగా ఉండటం తొక్కిసలాటకు దారి తీసినట్లుగా చెబుతున్నారు.
సాధారణంగా పర్వదినాలు, విశేష ఉత్సవాలు సమయంలో ఈ మార్గాన్ని మూసివేస్తారు. అధిక రద్దీ ఉన్నప్పటికీ యాత్రికులను అనుమతించారని తెలుస్తోంది. ఈ ఘటనను హరిద్వార్ ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్ రితేష్ షా ధృవీకరించారు. ఈ తొక్కిసలాటకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
పోలీసులు క్షతగాత్రులను చేతుల మీద ఎత్తుకుని ఆసుపత్రులకు పరుగులు తీయడం, వారిని అంబులెన్స్ లల్లో ఎక్కించడం వంటి దృశ్యాలు ఈ వీడియోల్లో కనిపిస్తోన్నాయి. మనసా దేవి ఆలయానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి నిత్యం భక్తులు వస్తుంటారు. దీనివల్ల ఆలయం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది.
ఇదిలా ఉండగా, నైనిటాల్ హైకోర్టు తీర్పు వెలువరించేలోపే హరిద్వార్ మున్సిపల్ కార్పొరేషన్ మనసా దేవి రోప్‌వే టెండర్‌ను రద్దు చేసింది. హరిద్వార్‌లో 10 కిలోమీటర్ల పొడవైన సొరంగం నిర్మించనున్నారు. ఈ పథకం పూర్తయితే అనేక ప్రయోజనాలు కలుగుతాయని భావిస్తున్నారు. ఉత్తరాఖండ్‌లో రోప్‌వేల నిర్మాణం పర్యాటకులకు మరింత సులువు కానుంది.












Click it and Unblock the Notifications