ఆరు నిమిషాల నడక పరీక్ష-నో రెమిడెసివిర్- పిల్లల కరోనా చికిత్సకు కేంద్రం గైడ్‌లైన్స్
కరోనా సెకండ్ వేవ్ చివరి దేశకు చేరుకోవడంతో దీని తర్వాత మూడో దశ తప్పదన్న హెచ్చరికలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నారుల్నికాపాడేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇందులో భాగంగానే కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ చిన్నారులకు కరోనా సోకితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్సపై తాజా మార్గదర్శకాలు ప్రకటించింది.
Recommended Video
18 ఏళ్లకు లోపు వారికి కరోనా సోకితే ఎలాంటి చికిత్సా విధానాలు అనుసరించాలన్న దానిపై కేంద్రం తాజాగా మార్గదర్శకాలు ప్రకటించింది. ఇందులో కరోనా పాజిటివ్ సోకిన చిన్నారులకు ప్రస్తుతం పెద్లలకు ఇస్తున్న రెమ్‌డెసివిర్ డ్రగ్‌ను మాత్రం ఇవ్వొద్దని సూచించింది. అలాగే కరోనా లక్షణాలు తీవ్రంగా ఉంటేనే ఇతర స్టెరాయిడ్స్ వాడాలని, అదీ ఆస్పత్రుల్లోనే వాడాలని సూచించింది. చిన్నారులకు రెమ్‌డెసివిర్ వాడకంపై సరైన డేటా అందుబాటులో లేకపోవడంతో దీన్ని అస్సలు వాడొద్దని కేంద్రం తెలిపింది.

పిల్లల్లో కరోనా సోకినట్లు అనుమానం కలిగితే వారి చేతి వేలికి పల్స్ ఆక్సీమీటర్ పెట్టి ఆరు నిమిషాలపాటు వాకింగ్ చేయించాలని, మధ్యలో ఆక్సిజన్ లెవల్ 94 కంటే తగ్గినా, ఇతరత్రా రుగ్మతలు ఏవైనా కనిపించినా గుర్తించాలని సూచించింది. అలాంటి పిల్లల్ని వెంటనే ఆస్పత్రుల్లో చేర్చి చికిత్స మొదలపెట్టాలని కేంద్రం సూచించింది. అస్ధమాతో బాధపడుతున్న వారికి మాత్రం ఈ టెస్ట్ చేయొద్దని తెలిపింది. తీవ్ర కరోనా లక్షణాలు ఉంటే మాత్రం ఆక్సిజన్ థెరపీ, ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ చేయడం, కార్టికో స్టెరాయిడ్స్ ఇవ్వడం మొదలుపెట్టాలని సూచించింది.
స్టెరాయిడ్స్‌ను చిన్నారులకు ఇవ్వాల్సి వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. ఇందులో ఏదైనా తేడా వస్తే తిరిగి బ్లాక్ ఫంగస్ కేసులు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఐదేళ్ల లోపు చిన్నారులు మాస్క్ వాడొద్దని, ఆరేళ్ల నుంచి 11 ఏళ్ల లోపు వారైతే తల్లితండ్రుల పర్యవేక్షణలో మాస్కులు వాడాలని తెలిపింది. పిల్లలకు సీటీ స్కాన్‌లు చేయాల్సి వచ్చినప్పుడు కూడా ఆచితూచి వ్యవహరించాలని డాక్టర్లకు కేంద్రం తెలిపింది.












Click it and Unblock the Notifications