లోక్‌సభలో రచ్చ.. తెలంగాణ ఎంపీ సహా 8 మందిపై వేటు!
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ఐదో రోజైన ఫిబ్రవరి 3న(మంగళవారం) లోక్‌సభలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. సభా మర్యాదలకు భంగం కలిగించారనే కారణంతో 8 మంది విపక్ష ఎంపీలను(7గురు కాంగ్రెస్, ఒకరు సీపీఎం) ప్రస్తుత బడ్జెట్ సమావేశాల మిగిలిన కాలానికి సస్పెండ్ చేశారు.
అసలేం జరిగిందంటే?
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ.. భారత్-చైనా సరిహద్దు వివాదానికి సంబంధించి మాజీ సైన్యాధిపతి ఎం.ఎం.నరవణే రాసిన (అప్రచురిత) పుస్తకంలోని అంశాలను ప్రస్తావించే ప్రయత్నం చేశారు. అయితే దీనికి స్పీకర్ అనుమతించకపోవడంతో విపక్ష సభ్యులు తీవ్రంగా నిరసన తెలిపారు. ఈ క్రమంలో కొందరు ఎంపీలు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి కాగితాలు చించి, స్పీకర్ వైపు విసిరేశారు.

సస్పెండ్ అయిన ఎంపీలు వీరే:
సభలో అనుచితంగా ప్రవర్తించారనే కారణంతో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది. సస్పెన్షన్‌కు గురైన వారిలో కాంగ్రెస్‌కు చెందిన గుర్జీత్ సింగ్ ఔజ్లా, అమరీందర్ సింగ్ రాజా వారింగ్, మాణిక్కం ఠాగూర్, హిబీ ఈడెన్, ప్రశాంత్ పడోలే, డీన్ కురియకోస్, చామల కిరణ్ కుమార్ రెడ్డి (తెలంగాణ - భువనగిరి ఎంపీ), సీపీఎం పార్టీకి చెందిన మదురై ఎంపీ ఎస్. వెంకటేశన్‌లు ఉన్నారు.
విపక్షాల నిరసన
ఎంపీల సస్పెన్షన్‌ను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇది 'ప్రజాస్వామ్య హత్య' అని అభివర్ణించింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నేతృత్వంలో ఎంపీలు పార్లమెంట్ వెలుపల నిరసన ప్రదర్శన చేపట్టారు. జాతీయ భద్రత, భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై ప్రభుత్వం సమాధానం చెప్పలేకనే తమ గొంతు నొక్కుతోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. హంగామా నేపథ్యంలో స్పీకర్ లోక్‌సభను బుధవారం ఉదయం 11 గంటల వరకు వాయిదా వేశారు. సస్పెండ్ అయిన వారిలో తెలంగాణలోని భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. సభలో జాతీయ భద్రత అంశంపై మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆయన ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications