చైనాకు చెక్: హిమాలయాల్లో ఎత్తయిన పర్వతాన్ని చీల్చి రోడ్డు వేసిన భారత్
సముద్ర మట్టానికి వేల అడుగుల ఎత్తు.. కన్నుల ముందు భయంకరమైన మంచు కొండలు! శీతాకాలం వచ్చిందంటే చాలు, లడఖ్ లోని జన్స్‌కార్ లోయ వైపు వెళ్లడమంటే మృత్యువుతో చెలగాటమాడటమే. అలాంటి అత్యంత ప్రమాదకరమైన 'షింకున్ లా పాస్' పై భారత్ విజయం సాధించింది. హిమాలయాల్లో అత్యంత ఎత్తయిన ఈ పర్వత మార్గాన్ని చీల్చుకుంటూ సరికొత్త రోడ్డును నిర్మించి, చైనా సరిహద్దుల్లో మన శత్రువుల గుండెల్లో గుబులు రేపేలా మాస్టర్ ప్లాన్ అమలు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన రూ. 3,350 కోట్ల భారీ అభివృద్ధి ప్యాకేజీలో ఈ షింకున్ లా పాస్ రోడ్ ప్రాజెక్టే అత్యంత కీలకమైంది.
3 గంటల్లోనే చేరుకోవచ్చు
ఇప్పటివరకు మంచు తుఫాన్ల వల్ల ఏటా ఆర్నెల్ల పాటు లడఖ్ ప్రాంతం దేశంలోని ఇతర ప్రాంతాలతో పూర్తిగా సంబంధాలు తెగిపోయేవి. కానీ, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నిర్మించిన 298 కిలోమీటర్ల 'నిమ్ము-పదుమ్-దార్చా' రోడ్డు అందుబాటులోకి రావడంతో ఆ కష్టాలకు చెక్ పడింది. అత్యంత సవాలుతో కూడుకున్న ఈ షింకున్ లా పాస్ మార్గం వల్ల ఒకప్పుడు 12 గంటలు పట్టే సుదీర్ఘ ప్రయాణం ఇప్పుడు కేవలం 3 గంటల్లోనే పూర్తవుతుంది. శ్రీనగర్-లేహ్, మణాలి-లేహ్ మార్గాల తర్వాత లడఖ్‌కు ఇది మూడో ప్రత్యామ్నాయ కనెక్టివిటీ కారిడార్‌గా మారింది. ఎటువంటి వాతావరణంలోనైనా చైనా సరిహద్దులకు మన సైనిక బలగాలను, భారీ యుద్ధ ట్యాంకులను క్షణాల్లో తరలించడానికి ఈ రహదారి భారత్‌కు కొండంత బలాన్నిస్తోంది.

పెరిగిన పర్యాటకం
లడఖ్ అభివృద్ధి, రక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను అందుబాటులోకి తెచ్చింది. రూ. 640 కోట్లతో లేహ్ విమానాశ్రయం వద్ద నిర్మించిన నూతన ప్యాసింజర్ టెర్మినల్ ద్వారా వార్షిక ప్రయాణికుల సామర్థ్యం 10 లక్షల నుంచి 35 లక్షలకు పెరిగి పర్యాటక రంగానికి ఊతమిస్తోంది. మరోవైపు 'అమృత్ హిమ్ సరోవర్' పథకం కింద 40 గ్రామాల్లో జలాశయాలను ఏర్పాటు చేసి తాగు, సాగునీటి కొరతకు శాశ్వత పరిష్కారం చూపగా, వెనుకబడిన గ్రామాలకు నిరంతరాయ విద్యుత్ కోసం 9 మెగావాట్ల 'హను' హైడ్రో ఎలెక్ట్రిక్ ప్రాజెక్ట్, కొత్త ట్రాన్స్‌మిషన్ లైన్లను అందుబాటులోకి తెచ్చారు. అలాగే లడఖ్ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడేందుకు లేహ్‌లోని సింధు ఘాట్ వద్ద దేశంలోనే తొలిసారిగా 'పెట్రోగ్లిఫ్ కన్జర్వేషన్ పార్క్'ను ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టులన్నీ సరిహద్దు రక్షణను సుదృఢం చేయడంతో పాటు లడఖ్ ప్రజల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపుతున్నాయి.














Click it and Unblock the Notifications
