బంగాళాఖాతంలో మరో అల్పపీడనం: 18 జిల్లాల్లో హైఅలర్ట్: 70 కి.మీ వేగంతో..
భువనేశ్వర్: రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తోన్నాయి. హైదరాబాద్ ఇప్పటికే వర్ష ప్రభావానికి గురైంది. పలు ప్రాంతాలు జలమయమౌతున్నాయి. రోడ్లన్నీ వర్షపునీటితో నిండిపోతున్నాయి. ఏపీలో దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ వర్షాలు అడపా దడపా కురుస్తోన్నాయి. ఉత్తరాంధ్ర, కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాల వల్ల ఏపీ, తెలంగాణల్లో చేతికి అందిన పంట దెబ్బతిన్నది.
వచ్చే 24 గంటల్లో విశాఖపట్నంతో పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం, విజయవాడ, కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, తిరుపతిలో ఈ సాయంత్రం తేలికపాటి జల్లులు పడొచ్చని పేర్కొంది.

బంగాళాఖాతంలో తాజాగా మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ఉదయం 8:30 నిమిషాలకు ఆగ్నేయ బంగాళాఖాతం గగనతలంపై ఈ ఆవర్తనం ఏర్పడినట్టు కోల్‌కతలోని భారత వాతావరణ కేంద్రం రీజినల్ డైరెక్టర్ డాక్టర్ జీకే దాస్ తెలిపారు. 8వ తేదీ నాటికి ఇది అల్పపీడనంగా మారుతుందని, 9వ తేదీ నాటికి పెను తుఫాన్‌గా రూపాంతరం చెందుతుందని వివరించారు. దీని ప్రభావంతో తమిళాడు, ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో భారీ వర్షాలు కురుస్తాయని అన్నారు.
— India Meteorological Department (@Indiametdept) May 6, 2023
ప్రస్తుతం మోచా తుఫాన్ ప్రభావంతో ఏపీలోని కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ తుఫాన్‌కు తోడుగా తాజాగా మరో అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. ప్రత్యేకించి ఒడిశాపై దీని ప్రభావం అధికంగా ఉంటోంది. 18 జిల్లాల్లో ఒడిశా ప్రభుత్వం హైఅలర్ట్ జారీ చేసింది. బాలాసోర్, భద్రక్, జాజ్‌పూర్, కేంద్రపారా, కటక్, పూరీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
మల్కాన్‌గిరి, కోరాపుట్, రాయగడ, గజపతి, కంధమాల్, నవరంగ్‌పూర్, కియోంఝర్, మయూర్‌భంజ, బాలాసోర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ భువనేశ్వర్‌లోని భారత వాతావరణ కేంద్రం ఎల్లో నోటీసులను జారీ చేసింది. అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ స్పష్టం చేసింది. 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, దీని తీవ్రత 70 కిలోమీటర్ల వరకు ఉండొచ్చని తెలిపింది.












Click it and Unblock the Notifications