Doctor: వైద్యుడిని ఏడుసార్లు పొడిచిన రోగి కుమారుడు..!
తమిళనాడు రాజధాని చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం ఓ రోగి కుమారుడు వైద్యుడిని కత్తితో పొడిచాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.దాడిలో వైద్యుడు బాలాజీని నిందితుడు ఏడు కత్తిపోట్లు పొడిచాడు. డాక్టర్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. చెన్నై చెందిన ఓ మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నిందితుడిని సదరు మహిళ కొడుకు విఘ్నేష్ గా గుర్తించారు. కలైంజర్ సెంటినరీ హాస్పిటల్‌లోని క్యాన్సర్ వార్డులో విఘ్నేష్ కత్తితో వైద్యుడిపై దాడికి పాల్పడ్డాడు.
దాడి అనంతరం విఘ్నేష్ పారిపోయేందుకు ప్రయత్నించగా, పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వైద్యుడికి అవసరమైన చికిత్స అందించాలని ఆదేశించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని అధికారులకు స్పష్టం చేశారు."గిండి కలైంజర్ సెంటినరీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో పనిచేస్తున్న డాక్టర్ బాలాజీని ఒక రోగి కుటుంబ సభ్యుడు కత్తితో పొడిచాడు. నిందితుడిని వెంటనే అరెస్టు చేశారు. వైద్యుడికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించాను" అని ముఖ్యమంత్రి తెలిపారు.

ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు తగిన వైద్యం అందించడంలో తమ ప్రభుత్వ వైద్యుల నిస్వార్థ కృషి వెలకట్టలేనిదని స్టాలిన్ అన్నారు. వారి భద్రతకు భరోసా ఇవ్వడం తమ కర్తవ్యమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి మా సుబ్రమణియన్ కూడా ఈ విషయంలో వేగంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటనలో ఇద్దరిని అరెస్టు చేశామని తెలిపారు.
ఇందులో ప్రమేయం ఉన్న మరికొందరిని వెంటనే అరెస్టు చేసేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటారని చెప్పారు. ఆసుపత్రులలో కఠినమైన భద్రతా చర్యలు, వైద్య నిపుణులపై దాడులను తగ్గించడానికి కేంద్ర, రాష్ట్ర చట్టాలను పటిష్టం చేయాలని దేశవ్యాప్తంగా వైద్యులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజా ఈ ఘటనతో డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. వైద్యుడిపై దాడిని వైద్యుల సంఘం ఖండించింది.












Click it and Unblock the Notifications