స్టూడెంట్ ప్రాణం తీసిన కోతులు.. బిల్డింగ్ మీద నుంచి నెట్టేసి..
పిల్లలు ఎవరైనా అల్లరి చేస్తే కోతి చేష్టలు అంటాం. కోతులు చేసే పనులు ఎవరికీ అర్థం కావు. ఒక్కోసారి సరదాగా ఉంటాయి. మరోసారి మీద పడి గీరేస్తాయి. బిహార్ లో సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. అక్కడి కోతులు ఓ నిండు ప్రాణాన్ని తీశాయి. బిహార్ సవాయ్ జిల్లా భగవాన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మఘార్ అనే గ్రామంలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది.
ఏమైందంటే..
మఘార్ గ్రామానికి చెందిన ప్రియా కుమారి పదో తరగతి చదువుతోంది. అయితే ఇంట్లోని డాబాపై ప్రియ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతూ ఉండగా ఒక్కసారిగా కోతుల గుంపు ఆ ఇంటిపైకి వచ్చింది. కోతులను చూసి భయపడిన ప్రియ బిగ్గరగా అరిచింది. ఇది గమనించిన చుట్టుపక్కలవాళ్లు ప్రియను ధైర్యంగా ఉండమని.. మెట్లవైపు వచ్చి కిందకు దిగమని చెప్పారు. ప్రియ ధైర్యంగా మెట్ల వద్దకు వస్తున్న క్రమంలో ఓ కోతి ప్రియపైకి దూకింది. అంతేకాక ఆమెను గట్టిగా నెట్టివేసింది. దీంతో ప్రియ బిల్డింగ్ మీద నుంచి కింద పడిపోయింది. తీవ్రగాయాలపాలైన ప్రియను కుటుంబసభ్యులు సవాయ్ జిల్లాలోని సదన్ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు.. ప్రియ అపస్మారక స్థితిలోకి వెళ్లిందని చెప్పారు. అంతేకాక ప్రియకు గాయాలు బలంగా తగిలాయన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ప్రియ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపించింది.

ఇదే ఘటనపై మాట్లాడిన స్టేషన్ హౌజ్ ఆఫీసర్ సుజీత్ కుమార్ చౌదరీ.. ఈ ఘటనపై మృతురాలి తల్లిదండ్రులు ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం అప్పగించేందుకు నిరాకరించారని తెలిపారు. ఇదే ఘటనపై గ్రామస్థులు పై స్థాయి అధికారులపై మండిపడుతున్నారు. గ్రామంలో కోతుల సమస్య ఉందని గత కొంత కాలంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. సకాలంలో చర్యలు తీసుకొని ఉంటే ఇలాంటి ఘటనలు జరిగి ఉండేవి కావని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కోతుల నుంచి తమను రక్షించాలని గ్రామస్థులు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications