40 వేల మంది మోహరించిన వేళ: చైనాతో మళ్లీ డిస్కషన్స్: డబ్ల్యూఎంసీసీ: రంగంలో అజిత్ దోవల్?
న్యూఢిల్లీ: లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవడానికి భారత్ మరోసారి చొరవ ప్రదర్శిస్తోంది. వాస్తవాధీన రేఖ వెంబడి గల ఒకట్రెండు వ్యూహాత్మక ప్రాంతాల్లో చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) బలగాలు ఖాళీ చేయడానికి అంగీకరించకపోవడం, అదే సమయంలో- సుమారు 40 వేంది ఇంకా సరిహద్దుల్లో కొనసాగుతుండటం వంటి ప్రత్యేక పరిస్థితుల మధ్య భారత్.. మరోసారి చైనాతో సమావేశం కావడానికి సన్నాహాలు చేస్తోంది.
ఇందులో భాగంగా రెండు దేశాల మధ్య సరిహద్దు వ్యవహారాలు, సమన్వయానికి సంబంధించి ఏర్పాటు చేసిన వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్ (డబ్ల్యూఎంసీసీ) శుక్రవారం భేటీ కాబోతోంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు ఈ భేటీని ఏర్పాటు చేయబోతున్నారు. వర్చువల్ రూపంలో ఈ సమావేశం ఏర్పాటవుతుందని తెలుస్తోంది. డబ్ల్యూఎంసీసీ సమావేశం అవుతుందనే విషయాన్ని అధికారులు ధృవీకరించారు.

లఢక్ సమీపంలో వాస్తవాధీన రేఖ వివాదాన్ని కేంద్రబిందువుగా చేసుకుని భారత్‌పై మొన్నటిదాకా యుద్ధ సన్నాహాలు చేసిన చైనాను నియంత్రించే దిశగా భారత్ ఈ డబ్ల్యూఎంసీసీ సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవడానికి ఇప్పటిదాకా పలు విడతలుగా భారత్-చైనా మధ్య రక్షణ మంత్రిత్వ శాఖ పరంగా చర్చలు కొనసాగాయి. అవేవీ ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. అదే సమయంలో డబ్ల్యూఎంసీసీని తెరపైకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇదివరకే ఓ సారి డబ్ల్యూఎంసీసీ భేటీ ఏర్పాటైంది.
ఈ నెల 9వ తేదీ నుంచి వాస్తవాధీన రేఖను ఖాళీ చేసే ప్రక్రయిను చైనా చేపట్టింది. వాస్తవాధీన రేఖ నుంచి రెండు కిలోమీటర్ల దూరం వెనక్కి వెళ్లిపోయాయి చైనా సైనిక బలగాలు. గాల్వన్ వ్యాలీ, గోగ్రా పోస్టు వంటి ప్రాంతాలను ఖాళీ చేశాయి. వ్యూహాత్మకంగా కీలకంగా భావించే పంగ్యాంగ్ త్సొ, డెప్సాంగ్ వంటి ప్రాంతాలను ఖాళీ చేయట్లేదు. పైగా వాస్తవాధీన రేఖ వెంబడి గల కొన్ని ప్రాంతాల్లో చైనా సైనికులు సుమారు 40 వేల మంది ఇంకా మోహరించే ఉన్నారనే ఆర్మీ అధికారులు తాజగా వెల్లడించారు.
A meeting of the Working Mechanism for Consultation and Coordination (WMCC) on India-China border affairs likely to be held tomorrow: Sources
— ANI (@ANI) July 23, 2020
Recommended Video
ఇలాంటి పరిణామాల మధ్య భారత్.. మరోసారి దౌత్యపరమైన చర్చలకు తెర తీసింది. శుక్రవారం మరోసారి చైనా అధికారులతో సమావేశం కానుంది. డబ్ల్యూఎంసీసీ రూపంలో ఈ భేటీని నిర్వహించబోతోంది. చైనాతో సరిహద్దులను ఖాళీ చేయించడంపై భారత్ ఏ మేర పురోగతి సాధిస్తుందనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. చైనాపై ఎలాంటి ఒత్తిళ్లను తీసుకొస్తుందనేది చర్చనీయాంశమౌతోంది. ఈ సారి కూడా భారత్ తరఫున స్పెషల్ రెప్రజెంటేటివ్‌గా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications