Parliament Building:పాత పార్లమెంట్ భవనాన్ని కూల్చేస్తారా..?
పార్లమెంట్ భవనం... ప్రతి భారతీయుడికి ఇదొక ఎమోషన్. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత మనకంటూ సొంత పాలన వచ్చిన తర్వాత ఎన్నో సంఘటనలకు సాక్ష్యంగా నిలిచిన ఒకే ఒక వేదిక పార్లమెంట్ భవనం. ఎంతో మంది తమ గొంతుకను వినిపించేందుకు ఉపయోగపడిన వేదిక పార్లమెంట్. పార్లమెంట్ భవనాన్ని ప్రజాస్వామ్య దేవాలయంగా భావిస్తారు.అంతటి ఘన చరిత్ర ఉన్న ఈ ప్రజాదేవాలయం ఇకపై ఎలా ఉండనుంది...? కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభం కానున్న నేపథ్యంలో పాత పార్లమెంట్ భవనం పరిస్థితేంటి..?
పాత పార్లమెంట్ భవనం డిజైన్ చేసింది బ్రిటీష్ ఆర్కిటెక్ట్ సర్ ఎడ్విన్ లూటెన్స్, హర్‌బర్ట్ బేకర్. దీన్ని నిర్మించేందుకు ఆరేళ్లు సమయం పట్టింది. దీని నిర్మాణం 1927లో పూర్తయ్యింది. 1956లో మరో రెండు అంతస్తుల నిర్మాణం జరిగింది.2006లో పార్లమెంట్ మ్యూజియంను ఏర్పాటు చేశారు. 2500 సంవత్సరాల నాటి ఘనమైన భారతదేశ ప్రజాస్వామ్య వారసత్వం ఈ మ్యూజియంలో కనిపిస్తుంది.

స్వతంత్ర్య భారతదేశంలో తొలి పార్లమెంటు సమావేశం ఈ భవనంలో జరిగింది. ఆ సందర్భంలో భారత రాజ్యాంగాన్ని పార్లమెంట్ ఆమోదించింది. ఇక పార్లమెంట్ భవనంను వారసత్వ సంపదగా భావించి దీన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. వాస్తవానికి దీన్ని కౌన్సిల్ హౌజ్ అని పిలిచేవారు. భారతదేశ ప్రజాస్వామ్య స్ఫూర్తికి చిహ్నంగా దీన్ని పరిగణిస్తారు. ప్రస్తుతం ఇది సెంట్రల్ విస్టా నడిబొడ్డున ఉంది.
పాత పార్లమెంట్ భవనం స్థలం, సౌకర్యాలు, సాంకేతికపరంగా ప్రస్తుత అవసరాలను తీర్చలేకపోతోందని ప్రభుత్వం పేర్కొంటూ ఇక కొత్త భవనం అవసరమని భావించింది. దీంతో కొత్త పార్లమెంట్ భవనం నిర్మించేందుకు 60వేల మంది కార్మికులు పనిచేశారు. రెండు సంవత్సరాల పాటు దీని నిర్మాణం జరిగింది. ప్రస్తుతం నిర్మాణం పూర్తయింది. కొత్త పార్లమెంట్ భవనాన్ని మే 28వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేస్తారు. కొత్త పార్లమెంట్ భవనం సిద్ధంగా ఉన్న నేపథ్యంలో పాత పార్లమెంట్ భవనం పరిస్థితేంటి..?

మార్చి 2021లో, కేంద్ర గృహనిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ రాజ్యసభలో ఒక ప్రకటన చేశారు. కొత్త పార్లమెంట్ భవనం సిద్ధమైన తర్వాత, పాత పార్లమెంట్ భవనానికి మరమత్తులు చేసి ప్రత్యామ్నాయ వినియోగానికి అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు చెప్పారు. అయితే దీనిపై సమగ్రమైన ఆలోచన చేయలేదని కూడా చెప్పారు.
ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ భవనం దేశపు పురావస్తు సంపదగా పరిరక్షించబడుతుందని చెప్పారు. పార్లమెంట్‌లో జరిగే కొన్ని కార్యక్రమాలకోసం దీన్ని వినియోగించే యోచనలో ప్రభుత్వం ఉంది. అందుకు అనుగుణంగా మరమత్తులు, మార్పలు చేర్పులపై ప్రభుత్వం యోచిస్తోంది.ఇక కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి అయిన ఖర్చు అంచనా రూ.862 కోట్లుగా ఉన్నట్లు కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీ తెలిపారు.












Click it and Unblock the Notifications