ప్రియురాలికి వేరే పెళ్లి: ఆమె తల్లిని చంపేసిన ప్రియుడు
బదౌన్: ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లోని ఉజాని పోలీసుస్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తాను ప్రేమించిన అమ్మాయికి వేరే వ్యక్తితో పెళ్లి చేశారనే కోపంతో ఓ యువకుడు ఆమె కుటుంబసభ్యులపై గొడ్డలితో దాడిచేసి ఆమె తల్లిని చంపేశాడు.
యువకుడి దాడిలో మరో మహిళను కూడా తీవ్రంగా గాయపరిచాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవంబరు 22న సదరు యువతి వివాహం జరిగింది. కాగా, బుదవారం రాత్రి చందన్ అనే వ్యక్తి యువతి ఇంట్లోకి బలవంతంగా వెళ్లి గొడవ చేశాడు.

అడ్డుకోబోయిన యువతి తల్లి మున్నీదేవి(60)పై గొడ్డలితో దాడి చేశాడు. తీవ్ర గాయాలైన ఆమె అక్కడికక్కడే మరణించింది. అతని దాడిలో అడ్డుకోబోయిన మరో మహిళ కూడా తీవ్రంగా గాయపడింది. ఆమెను బరేలీ ఆస్పత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుడు చందన్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications