ఆధవ్ అర్జున విడాకులకు కారణాలు: భార్య డైసీ మార్టిన్ ఎవరు: లాటరీ కింగ్ ఆస్తుల విలువ ఎంత
తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలో అక్కడ అధికారంలో ఉన్న టీవీకే ప్రభుత్వ మంత్రి ఆధవ్ అర్జున.. విడాకులు తీసుకున్నారు. విజయ్ కేబినెట్ లో పబ్లిక్ వర్క్స్, క్రీడాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారాయన. తన భార్య డైసీ మార్టిన్ తో పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. 14 సంవత్సరాలుగా కొనసాగుతూ వచ్చిన వీరి వైవాహిక బంధానికి తెరపడినట్టయింది.
దీంతో తాజాగా డైసీ మార్టిన్ ఎవరనేది చర్చనీయాంశమౌతోంది. తమిళనాడులో లాటరీ కింగ్ గా పేరుపొందిన శాంటియగో మార్టిన్ కుమార్తె డైసీ మార్టిన్. 2012 నవంబర్ లో ఆమెను వివాహం చేసుకున్నారు.. ఆధవ్ అర్జున. ప్రస్తుతం ఏరీస్ ఇన్‌వెస్ట్‌మెంట్స్ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. శాంటియగో మార్టిన్ భార్య, ఆధవ్ అర్జున అత్త లీమా రోజ్ మార్టిన్.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే అభ్యర్థిగా లాల్గుడి నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.

తమిళనాడులో రిచ్చెస్ట్ ఎమ్మెల్యే లీమా రోజ్ మార్టిన్. ఎన్నికల అఫిడవిట్ లో 1,045 కోట్ల రూపాయల విలువైన ఆస్తిని చూపారు. ఏఐఏడీఎంకే టికెట్‌పై పోటీ చేసిన లీమా రోజ్.. డీఎంకే, టీవీకే అభ్యర్థుల నుండి తీవ్ర పోటీని ఎదుర్కొన్నారు. అయినప్పటికీ 2,500 ఓట్ల మెజారిటీతో విజేతగా నిలిచారు. డైసీ మార్టిన్ సోదరుడు జోస్ ఛార్లెస్ మార్టిన్ కూడా ఎమ్మెల్యేనే. పుదుచ్చేరి నుంచి ఆయన విజయం సాధించారు. లక్ష్య జననాయక కచ్చి పార్టీ వ్యవస్థాపకుడు కూడా.
ఆ పార్టీ అభ్యర్థిగా పుదుచ్చేరి కామరాజ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి జోస్ ఛార్లెస్ పోటీ చేశారు. 10,205 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉంటోందీ పార్టీ. తమిళనాడులో లాటరీలపై నిషేధం ఉన్నప్పటికీ శాంటియాగో మార్టిన్ 'ఫ్యూచర్ గేమింగ్' సంస్థ ద్వారా రమ్మీ వంటి పలు ఆన్ లైన్ గేమ్ లల్లో పెట్టుబడులు పెడుతున్నారు. మొత్తంగా డైసీ మార్టిన్ కుటుంబ ఆస్తుల విలువ 1,200 కోట్ల రూపాయలపైమాటే.
ఆధవ్ అర్జున.. టీవీకేలో నంబర్ 2గా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే. ఆ పార్టీ విజయంతో కీలక పాత్ర పోషించారు. పార్టీ ప్రారంభం నుంచీ విజయ్ వెన్నంటే ఉంటూ వస్తోన్నారు. అత్యంత కీలకమైన విల్లివాక్కం నుంచి 17,302 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఆయన కుటుంబం నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.
మార్టిన్ కుటుంబం ఎదుర్కొంటున్న రాజకీయ సవాళ్లు వీరి కుటుంబ వాతావరణంపై ప్రభావం చూపినట్లు చెబుతున్నారు. ఒకవైపు ఆధవ్ అర్జున.. టీవీకే ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతోండగా.. ఆయన అత్తగారు అంటే డైసీ తల్లి లీమా రోజ్ మార్టిన్.. ప్రతిపక్ష ఏఐఏడీఎంకే పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ కుటుంబంలో ఉన్న రాజకీయ వైరుధ్యాలు ఇదివరకే బహిర్గతం అయ్యాయి కూడా. ఈ ఏడాది మే లో అర్జున బావమరిది జోస్ చార్లెస్ మార్టిన్ ఆయనపై బహిరంగ ఆరోపణలు చేయడం పెద్ద వివాదానికి దారితీసింది.













Click it and Unblock the Notifications
