Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేజ్రీవాల్ కేబినెట్లో ఉద్దండులు: అలిగిన బిన్నీ స్పీకర్‌గా!

గురువారం ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న అరవింద్ కేజ్రీవాల్.. మంగళవారం తన మంత్రివర్గ సభ్యుల పేర్లను ప్రకటించారు. మనీష్ సిసోడియా, సోమనాథ్ భార్తీ, రాఖీ బిర్లా, సౌరభ్ భరద్వాజ్, సత్యేంద్ర జైన్, గిరీశ్ సోనీ ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారులో మంత్రులు కానున్నారు.

ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే తొలి సంతకం విద్యుత్ పైనే పెడతానని, అవినీతిపరుల భరతం పడతానని ఎఎపి కన్వీనర్ కేజ్రీవాల్ చెబుతున్నారు. తప్పు చేసిన కాంగ్రెసు మంత్రుల పైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. మంత్రి మండలిలో ఆ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోమన్నారు.

AAP

అసమ్మతి సెగ

తన మంత్రివర్గం కూర్పుపై కసరత్తు చేస్తున్న కేజ్రీవాల్‌కు సొంత పార్టీ ఎమ్మెల్యే నుండి ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైంది. తనకు మంత్రిమండలిలో స్థానం కల్పించలేదంటూ వినోద్ కుమార్ బిన్నీ అనే ఎమ్మెల్యే నిరసన వ్యక్తం చేస్తూ కేజ్రీవాల్ ఇంటి వద్ద జరిగిన సమావేశం నుండి మధ్యలోనే బయటకు వచ్చారు. అతను గతంలో కాంగ్రెసు పార్టీ నుండి ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ కార్పోరేటర్‌గా రెండుసార్లు ఎన్నికయ్యారు. వినోద్‌కు నచ్చజెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్పీకర్ పదవి ఇచ్చే అవకాశముంది. బిన్నీ కూడా విభేదాలు లేవని, మంత్రి పదవి దక్కలేదన్న బాధ లేదని తెలిపారు.

తొలుత మంత్రివర్గంలోకి తీసుకున్న ఆరుగురు..

మనీష్ సిపోడియా (41)

సిసోడియా మాజీ పాత్రికేయుడు. ఆకాశవాణిలో, ఓ ప్రైవేట్ న్యూస్ చానల్‌లో పని చేశారు. జన్‌లోక్‌పాల్ ఆందోళనలో చురుగ్గా పాల్గొన్నారు. సమాచార హక్కు ఉద్యమకారుడిగా సుపరిచితుడు. అవినీతి మంత్రుల ఆస్తులపై విచారణ జరపాలంటూ పది రోజులపాటు నిరాహార దీక్ష చేశారు. 'ఆప్'లో చేరారు. ప్రతాప్‌గంజ్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి నకుల్ భరద్వాజ్‌ను మనీశ్ ఓడించారు. ఇప్పుడు మంత్రి అవుతున్నారు. 'ఆప్'లో కేస్రీవాల్ తర్వాత ప్రముఖ స్థానం మనీశ్ సిసోడియాదే.

సోమ్‌నాథ్ (39)

సోమనాథ్ పోరాటం, ఆరాటం న్యాయం కోసం, సమాజం కోసమే. అందరిలా ఆలోచించి ఉంటే... ఏదో ఉద్యోగం చేసుకునేవారు. కానీ... సమాజ సేవలో స్థిరపడ్డారు. సోమనాథ్ భార్తీ ఐఐటీలో ఎమ్మెస్సీ పూర్తి చేశారు. ఆ తర్వాత న్యాయవాద పట్టా పుచ్చుకుని లాయర్‌గా స్థిరపడ్డారు. కాసులు వచ్చే కేసులు కాకుండా... సమాజానికి సంబంధించిన సమస్యలను ఎంచుకుని, వాటిపై న్యాయపోరాటం చేస్తారు. 'నిర్భయ' ఉదంతం తర్వాత పోలీసులు 8 మంది బాలలను అన్యాయంగా ఇరికించారు. సోమనాథ్ వారి తరఫున వాదించి... గెలిచారు. మాలవ్యనగర్ నియోజకవర్గంలో విద్యాశాఖ మంత్రి కిరణ్ వాలియాను సోమనాథ్ 32,258 ఓట్ల తేడాతో ఓడించారు.

సౌరభ్ (34)

సౌరభ్ వృత్తిరీత్యా ఇంజనీర్. 2005దాకా ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేసేవారు. అప్పట్లో ఒక నిరుపేద బాలికపై జరిగిన అత్యాచారం సౌరభ్‌ను కదిలించింది. ఆమెకు న్యాయం చేసేందుకు నడుం బిగించారు. ఇలాంటి విషయాల్లో పోరాడేందుకు న్యాయపరమైన పరిజ్ఞానం అవసరమని గ్రహించి... 'లా' పూర్తి చేశారు. పేదల తరఫున కోర్టుల్లో వాదిస్తుంటారు. అంధులు, వృద్ధులు, వరద బాధితులు, పేద విద్యార్థుల సంక్షేమం కోసం కృషి చేస్తుంటారు. జన లోక్‌పాల్ ఉద్యమంలో పాల్గొన్నారు.

సత్యేంద్ర (49)

వృత్తి రీత్యా ఆర్కిటెక్ట్. నిజానికి ఆయన గతంలో కేంద్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌లో ఇంజనీర్‌గా పని చేసేవారు. తన శాఖలో కళ్లముందు జరుగుతున్న అవినీతి, అక్రమాలను చూసి సహించలేక ఉద్యోగానికి గుడ్‌బై చెప్పారు. ఆర్కిటెక్చర్ కన్సల్టెన్సీ ప్రారంభించారు. సామాజిక సమస్యలపై స్పందిస్తారు. అంధ బాలికల సంక్షేమం కోసం పని చేసే సంస్థకు చిత్రకూట్‌లో సొంత భవనం నిర్మించేందుకు సహకరించారు. మానసిక వైకల్యంతో బాధపడే చిన్నారుల కోసం ఏర్పడిన 'స్పర్శ్' అనే స్వచ్ఛంద సంస్థలోనూ ఆయన భాగస్వామి. నిరుపేద యువతుల వివాహాలకు తనవంతు సహాయం అందిస్తుంటారు. జన్‌లోక్‌పాల్ ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్నారు. 'ఆప్' తరఫున షాకూర్ బస్తీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.

సోనీ (49)

సుమారు పాతికేళ్లుగా 'భారత్‌కీ జనవాదీ నౌజవానీ సభ' అనే స్వచ్ఛంద సంస్థ తరఫున పని చేస్తున్నారు. మాదీపూర్ ప్రాంత ప్రజలతో మమేకమై, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. 'బిజిలీ-పానీ' పేరిట జరిగిన ఆందోళనలో ఆయన ఇంటింటికీ తిరిగి... ప్రజల్లో అవగాహన పెంచారు. మాదీపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.

రాఖీ (26)
రాఖీది ఉద్యోగాల వేటలో, కెరీర్ ప్రస్థానంలో కొట్టుమిట్టాడే వయసు! కానీ... రాఖీ బిర్లా అందరిలాంటి యువతి కాదు. సమాజ హితమే తన హితమనుకున్నారు. ఓ ప్రైవేటు టీవీ చానల్‌లో విలేకరి ఉద్యోగాన్ని వదులుకున్నారు. జన్‌లోక్‌పాల్ ఉద్యమంలో పాల్గొన్నారు. 'వాల్మీకి' సామాజిక వర్గానికి చెందిన ఆమె... వారి సంక్షేమం కోసం కృషి చేసేవారు. రాఖీ బిర్లా ఢిల్లీ ఎన్నికల బరిలో నిలిచి... నాలుగుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన మంత్రి రాజ్‌కుమార్ చౌహాన్‌ను ఓడించారు. అత్యంత చిన్న వయసున్న మంత్రిగా రికార్డు సృష్టించనున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+