ఎటిఎంలో మహిళపై దారుణ దాడి: నిందితుడి అరెస్టు?
బెంగళూర్: కర్ణాటక రాజధాని బెంగళూర్‌లోని ఓ ఎటిఎంలో మహిళా బ్యాంక్ మేనేజర్‌పై అత్యంత దారుణంగా దాడి చేసిన ఘటనకు సంబంధించిన కేసులో నిందితుడి పోలీసులు పట్టుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కర్ణాటక రాష్ట్రంలోని తుముకూరు జిల్లా టిపటూరులో అతన్ని పట్టుకున్నట్లు శుక్రవారం సాయంత్రం టీవీ చానెళ్లలో వార్తలు వచ్చాయి. అతన్ని సతీష్‌గా గుర్తించినట్లు తెలుస్తోంది. తెలుగు టీవీ న్యూస్ చానెళ్లలో ఈ మేరకు శుక్రవారం సాయంత్రం వార్తలు వచ్చాయి.
అయితే, పోలీసులు పట్టుకున్నది అసలు నిందితుడిని కాదని, అతన్ని పోలిన వ్యక్తిని పట్టుకున్నట్లు ప్రచారం సాగుతోంది. నిజానిజాలు తెలియాల్సి ఉంది. గార్డు లేని రద్దీగా ఉండే జెసి రోడ్డులోని ఎటిఎం కేంద్రంలో ఓ దుండగుడు మహిళా బ్యాంక్ మేనేజర్‌పై దాడి చేశాడు. ఈ దృశ్యాలు సిసిటివీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఎల్ఐసీ భవనంలో కల కార్పొరేషన్ బ్యాంకు ఏటీఎంలో నగదు తీసుకోవడానికి కార్పొరేషన్ బ్యాంకుమేనేజర్ జ్యోతి ఉదయ్ (44) మంగళవారం ఉదయం ఏటీఎం కేంద్రంలోకి వెళ్లారు.

జ్యోతి లోపలికి ప్రవేశించిన కొద్ది క్షణాల్లోనే ఓ దుండగుడు ఏటీఎం కేంద్రంలోకి చొరబడి షట్టర్ మూసేశాడు. అరిస్తే చంపేస్తానంటూ వెంట బ్యాగులో తెచ్చుకున్న కత్తి, రివాల్వర్‌తో ఆమెను బెదిరించాడు. మారణాయుధాలు చూసినా బెదరని జ్యోతి ఆగంతకుడిపై తిరగబడింది. తనపై తిరగబడ్డ జ్యోతిపై ఆగంతకుడు కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆమెను తీవ్రంగా గాయపరిచాడు. దీంతో జ్యోతి స్పృహకోల్పోయింది.
స్పృహకోల్పోయిన జ్యోతి ఒక పక్కకి ఒరిగిపోయింది. నిందితుడు తాపీగా నడుచుకుంటూ బయటకు వెళ్లిపోయాడు. బెంగళూరు నగరంలో మంగళవారం పట్టపగలు జరిగిన ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. గాయపడిన జ్యోతిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఏటీఎం కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా నిందితుడి ఫొటో సహయంతో అతడిని అరెస్టు చేయాలని పోలీసులు యత్నిస్తున్నారు.
దుండగుడు వెళ్లిపోయిన తర్వాత రక్తమోడుతూ రాజరాజేశ్వరి నగర్‌కు చెందిన మహిళ మూడు గంటలపాటు స్పృహ కోల్పోయి ఎటిఎం కేంద్రంలోనే ఉండిపోయింది. ఎటిఎం కేంద్రం షట్టర్ కింది నుంచి రక్తం వస్తుండడం గమనించిన స్కూలు పిల్లలు ట్రాఫిక్ పోలీసులకు, దారిన పోయేవారికి చెప్పారు. కపాళానికి దెబ్బ తగలడంతో జ్యోతి కుడిపక్క శరీరం పడిపోయిందని వైద్యులు చెప్పారు. దాడి చేసిన వ్యక్తి వద్ద ఉంది నకిలీ గన్ కావచ్చునని, కన్నడంలో మాట్లాడాడని పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications