Stan Swamy కన్నుమూత: బెయిల్ కోసం హైకోర్టులో పిటీషన్లు..అంతలోనే
ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భీమా-కోరేగావ్, ఎల్గార్ పరిషత్ కేసులో అరెస్టయిన సామాజిక ఉద్యమకర్త ఫాదర్ స్టాన్ స్వామి కన్నుమూశారు. ఆయన వయస్సు 84 సంవత్సరాలు. ఆయనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఒకవంక బోంబే హైకోర్టులో దాఖలైన పిటీషన్‌పై విచారణ కొనసాగుతోన్నసమయంలోనే- స్టాన్ స్వామి తుదిశ్వాస విడిచారు. అనారోగ్యానికి గురైన ఆయన కొంతకాలంగా ముంబైలోని ఓ ఆసుపత్రిలో పోలీసుల కస్టడీలో ఉంటూ చికిత్స పొందుతోన్నారు.
ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కొద్దిసేపటి కిందటే తుదిశ్వాస విడిచారు. భీమా-కోరేగావ్, ఎల్గార్ పరిషత్ కేసులో అరెస్టయిన వారిలో స్టాన్ స్వామి ఒకరు. తెలంగాణకు చెందిన విప్లవ రచయిత, విరసం మాజీ అధ్యక్షుడు వరవర రావు కూడా ఇదే కేసులో అరెస్టయిన విషయం తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హత్యకు కుట్రపన్నారనే కారణంతో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు వరవర రావు, స్టాన్ స్వామి సహా మరి కొందరిని అరెస్టు చేశారు. ప్రస్తుతం వారంతా ముంబైలోని తలోజా జైలులో శిక్షను అనుభవిస్తోన్నారు.

వారిపై అవాంఛిత కార్యకలాపాలు నిరోధక చట్టం (యుఏపీఏ) కింద కేసు నమోదు చేశారు. కొంతకాలం కిందట స్టాన్ స్వామి కరోనా వైరస్ బారిన పడ్డారు. అనంతరం కోలుకున్నారు. ఆ తరువాత మళ్లీ అనారోగ్యానికి గురి కావడంతో ముంబైలోని హోలి ఫ్యామిలీ ఆసుపత్రికి జైలు అధికారులు ఆయనను తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. తలోజా జైలులో అనారోగ్యానికి గురైన ఆయనను ఆసుపత్రికి తరలించాలంటూ మే 29వ తేదీన బోంబే హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.
Recommended Video
అప్పటి నుంచీ ఆయన ఆరోగ్యం కుదుటపడలేదు. స్టాన్ స్వామి ఆరోగ్య పరిస్థితి, వయస్సును దృష్టిలో ఉంచుకుని బెయిల్ మంజూరు చేయాలంటూ బోంబే హైకోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. వాటి మీద విచారణ చేపట్టడానికి బోంబే హైకోర్టు ధర్మాసనం సన్నాహాలు చేస్తోన్న సమయంలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన కన్నుమూత సమాచారం తెలిసిన పలువురు సామాజిక ఉద్యమ నాయకులు, కార్యకర్తలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోన్నారు. సంతాపం తెలుపుతున్నారు.












Click it and Unblock the Notifications