దళపతి గ్రాండ్ ఎంట్రీ- పార్టీ పేరు వెల్లడి
Thalapathy Vijay: తమిళ నటుడు విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించడం ఖాయమైంది. సొంత పార్టీని ప్రకటించారు. ఆయన పొలిటికల్ ఎంట్రీపై మొన్నటివరకు వినిపించిన గాసిప్స్ అన్నీ వాస్తవ రూపాన్ని దాల్చాయి. విజయ్ పెట్టే పార్టీ ఎలా ఉండొచ్చు? దాని పేరేంటీ?..అనే ప్రశ్నలకు తెరదించారు.
Recommended Video

తమిళనాట ఇళయ దళపతిగా లక్షలాదిమంది అభిమానులు, ఫాలోవర్లను సంపాదించుకున్న ఉన్న విజయ్.. రాజకీయ అరంగేట్రం చేశారు. తాను నెలకొల్పిన పార్టీ పేరును అధికారికంగా ప్రకటించారు. తమిళగ వెట్రి కజగం నామకరణం చేసినట్లు తెలిపారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఓ ప్రకటన విడుదల చేశారు.

లోక్‌సభ ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో విజయ్.. కొత్త పార్టీని నెలకొల్పడం తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. సౌతిండియన్ సూపర్ స్టార్‌గా కోట్లాదిమంది అభిమానులు ఉన్న రజినీకాంత్ చేయలేని పనిని విజయ్ సాధించినట్టయింది. రాజకీయాల్లో అడుగు పెట్టే సాహసానికి పూనుకున్నట్టయింది.
సినిమా నటులు వెండితెర మీది నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం కొత్తేమీ కాదు. తమిళనాడులో కోట్లాది మంది అభిమానుల ఆరాధ్యదైవాలుగా నిలిచిన ఎం జీ రామచంద్రన్, జయలలిత రాజకీయాల్లో అత్యున్నత శిఖరాలను అందుకున్నారు. ఎంజీ రామచంద్రన్, జయలలిత.. ఇద్దరి బ్యాక్‌గ్రౌండ్ సినిమాలే.
బహుభాషా నటుడు కమల్ హాసన్.. మక్కళ్ నీధి మయ్యం (ఎంఎన్ఎం) పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయారు. రజినీకాంత్ కొత్త పార్టీని ఏర్పాటు చేస్తారంటూ చాలాకాలం నుంచి వార్తలు వస్తున్నప్పటికీ.. అది కార్యరూపం దాల్చలేదు.
విజయ్.. పొలిటికల్ ఎంట్రీ ఖాయమనే వార్తలు చాలాకాలం నుంచీ తమిళనాడులో వినిపిస్తూ వస్తోన్నాయి. దీనికి సంబంధించిన బ్యానర్లు, పోస్టర్లు విస్తృతంగా వెలిశాయి. ఎట్టకేలకు అభిమానుల కోరిక మేరకు విజయ్ రాజకీయాల్లో అడుగు పెట్టారు. పార్టీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ పనులను విజయ్ తండ్రి, ప్రముఖ దర్శకుడు ఎస్‌ఏ చంద్రశేఖర్ పూర్తి చేశారు.
#தமிழகவெற்றிகழகம் #TVKVijay https://t.co/Szf7Kdnyvr
— Vijay (@actorvijay) February 2, 2024
విజయ్‌పై ఇదివరకు ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులను సైతం ఎదుర్కొన్నారు. విజయ్‌ను అదుపులోకి తీసుకుని విచారణను నిర్వహించారు. ఈ ఘటన అప్పట్లో తమిళనాడులో కలకలం పుట్టించింది. తమ అభిమాన కథానాయకుడిపై ఉద్దేశపూరకంగా దాడులు చేయించారని, కక్షసాధింపు చర్యలకు ప్రభుత్వం పాల్పడిందంటూ ఆరోపణలు వచ్చాయి. అప్పటి నుంచి విజయ్ కూడా రాజకీయాల్లోకి రావలంటూ అభిమానులు పట్టుబడుతున్నారు.












Click it and Unblock the Notifications