బీజేపీలోకి నటి మీనా - అసెంబ్లీ బరిలో, కీలక బాధ్యతలు..!!
మరో ప్రముఖ నటి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారు. బాల నటిగా వెండి తెర పైన ప్రస్థానం మొదలు పెట్టి.. ప్రముఖ హీరోయిన్ గా ఎదిగిన మీనా ఇప్పుడు బీజేపీలో చేరేందుకు రంగం సిద్దం అయింది. తమిళనాడులో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ నేతలు సినీ ప్రముఖులకు గాలం వేస్తోంది. రాష్ట్రంలో విజయ్ పార్టీతో మారుతున్న సమీకరణాల వేళ.. అన్నా డీఎంకే తో పొత్తు.. సినీ నటుల ప్రచారంతో ఎన్నికల ముందే కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. ఇక, మీనా రాజకీయ భవిష్యత్.. పదవి పైన హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ప్రముఖ సినీ నటి మీనా బీజేపీలో చేరటం దాదాపు ఖాయమైంది. మీనా సహచర నటి.. ప్రస్తుతం బీజేపీలో కీలక పాత్ర పోషిస్తున్న మహిళా నేత రాయబారంతో తాజాగా ఢిల్లీ కేంద్రంగా ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకున్నాయి. మీనా బీజేపీలో చేరేందుకు వీలుగా అవసరమైన చర్చలు పూర్తయ్యాయి. తమిళనాడులో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న వేళ.. అక్కడ బీజేపీ కొత్త వ్యూహాలను అమలు చేస్తోంది. ఇప్పటికే ప్రతిపక్ష అన్నాడీఎంకేతో పొత్తు ఖరారు చేసుకుంది. అదే సమయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ను రంగంలోకి దించింది. తమిళనాడు నేతలతో కలిసి తరచూ పవన్ రాష్ట్రంలో కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇక, చిన్నా చితకా పార్టీలను ఎన్‌డీఏ కూటమిలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

తమిళనాట ప్రజాదరణ వున్న వివిధ రంగాల ప్రముఖులను కూడా దరి చేర్చుకుంటోంది. సినీ ప్రముఖులతోనూ మంతనాలు సాగిస్తోంది. ఇప్పటికే ఖుష్బూ, నమిత, శరత్‌కుమార్ వంటి సినీ ప్రముఖులను చేర్చుకున్న బీజేపీ.. తాజాగా మీనాపై దృష్టి పెట్టింది. త్వరలోనే బీజేపీలో మీనా అధికారికంగా చేరటం ఖాయమని తెలుస్తోంది. పార్టీలో చేరిన వెంటనే మీనాకు పార్టీలో రాష్ట్ర స్థాయి పదవి పైన హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ తో చర్చలు జరిగాయి. రాష్ట్రస్థాయిలో పార్టీ కీలక పదవుల్లో ఖుష్బూ, మీనాలను నియ మించేలా నయినార్ నాగేంద్రన్ అధిష్ఠానానికి సిఫారసు చేసారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి మీనా సిద్దంగా ఉంటే.. సీటు కేటాయింపు పైనా చర్చ జరుగుతోంది. దీంతో.. ఇప్పుడు మీనా బీజేపీ లో చేరటం ద్వారా రాజకీయంగా ఏ మేర సక్సెస్ అవుతారనే చర్చ మొదలైంది.












Click it and Unblock the Notifications