నా భార్యను ఎత్తుకెళ్లాడు, అక్రమ సంబంధం: ఆర్మీ డాక్టర్
పాట్నా: సైన్యంలో పని చేస్తున్న ఓ కల్నల్ ర్యాంకు అధికారి తన భార్యను ఎత్తుకెళ్లారని, తనను బెదిరిస్తున్నారని సైన్యంలోనే వైద్యుడిగా మేజర్ ర్యాంకులో పని చేస్తున్న ఓ అధికారి పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలోని దనపూర్ మిలటరీ క్యాంపులో వెలుగు చూసింది. ఈ ఫిర్యాదు బుధవారం సాయంత్రం ఇచ్చారు.
మేజర్ బినోద్ కుమార్ ఫిర్యాదు మేరకు కల్నల్ రవిచందర్ పైన కేసు నమోదు చేసినట్లు పాట్నా ఎస్పీ (సిటీ) శివదీప్ లాండే తెలిపారు. రవిచందర్ పాఠశాల కమిటీ చైర్మన్ అని, అదే పాఠశాలలో తన భార్య టీచర్‌గా పని చేస్తున్న సమయంలో ఇద్దరికి పరిచయం ఏర్పడిందని తెలిపారు. అనంతరం వారి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది.
ఈ సంబంధం గురించి తెలిసిన తర్వాత బినోద్ కుమార్ తన భార్యను ఉద్యోగం మానేయమన్నాడు. అతని మాటను ఆమె వినలేదు. అతను తన భార్యకు కౌన్సెలింగ్ ఇచ్చాడు. కళంకం తెచ్చే పనులు చేయవద్దని భార్యకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు. కాగా, వీరికి ఎనిమిదేళ్ల కొడుకు కూడా ఉన్నాడు.

డిసెంబర్ 9వ తేదీన సాయంత్రం బినోద్ కుమార్ డ్యూటీకి వెళ్లే ముందు ఇంట్లో అన్నం తింటున్నాడు. ఈ సమయంలో తన భార్య ఎవరితోనే ఫోన్లో మాట్లాడుతుండటం విన్నాడు. ఆమె రహస్యంగా మాట్లాడింది.
అనంతరం తాను రాత్రి పదకొండున్నర గంటలకు డ్యూటీకి వెళ్లానని వైద్యుడు చెప్పారు. తన భార్య, రవిచందర్ మధ్య అక్రమ సంబంధం ఉందని చూపించేందుకు వారిద్దరు సన్నిహితంగా ఉన్న రెండు ఫోటోలను కూడా బినోద్ కుమార్ తీసుకున్నాడని పోలీసులు తెలిపారు.
అయితే, వారు తన పైన దాడి చేసి, ఫోన్ లాక్కున్నారని వైద్యుడు బినోద్ కుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అంతేకాకుండా, తనను కాల్చేస్తానని రవిచందర్ బెదిరించాడని చెప్పారని పోలీసులు తెలిపారు. తన భార్య కూడా తన పైన దాడికి పాల్పడిందని బినోద్ కుమార్ చెప్పారు.
కల్నల్ పైన సెక్షన్ 497(మరొకరి భార్యతో సంబంధం), 341, 323, 504 తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ లాండే చెప్పారు. కాగా, కల్నల్ రవిచందర్ మావోయిస్టు నిరోధక దళమైన కోబ్రా ఫోర్స్‌కు ఛైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. తాజా ఆరోపణలతో ఆయనను జార్ఖాండ్, బీహార్ సబ్ ఏరియా స్టేషన్ హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేశారు.












Click it and Unblock the Notifications