పహల్గావ్ తరువాత ఉగ్రవాదుల నెక్స్ట్ ట్రార్గెట్: ఉప్పందించిన కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో
Pahalgam Terror Attack: పహల్గామ్‌లో ఉగ్రదాడి చోటు చేసుకున్న అనంతరం జమ్మూ కాశ్మీర్‌లో అనూహ్య పరిణామాలు తలెత్తాయి. జమ్మూ కాశ్మీర్ అంతటా రెడ్ అలర్ట్ జారీ అయింది. భద్రత సిబ్బంది, పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరింపజేశారు.
జమ్మూ కాశ్మీర్‌లో వరుస ఎన్‌కౌంటర్లు చోటు చేసుకుంటోన్నాయి. బుధవారం నాడు బారాముల్లా, కుల్గామ్‌లల్లో, నేడు ఉధంపూర్ జిల్లాలో భద్రత బలగాలు- ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. యూరీ సెక్టార్ వద్ద భారీ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు చొరబాటుదారులు హతం అయ్యారు. వారిని బీఎస్ఎఫ్ జవాన్లు కాల్చి చంపారు. పెద్ద ఎత్తున మారణాయులను స్వాధీనం చేసుకున్నారు.

పహల్గామ్ తరువాత అలాంటి ఉదంతం.. దేశ ఆర్థిక రాజధానిలో చోటు చేసుకునే ప్రమాదం ఉందని కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యురో వెల్లడించింది. ఈ మేరకు మహారాష్ట్ర హోం మంత్రిత్వ శాఖను హెచ్చరించింది. ముంబై, శివారు ప్రాంతాలు, ఇతర తీర ప్రాంతాలపై గట్టి నిఘా ఉంచాలని సూచించింది.
ముంబై, చుట్టుపక్కల తీరప్రాంతాలపై నిరంతరాయంగా నిఘా ఉంచాలని ఇంటెలిజెన్స్ బ్యురో అప్రమత్తంగా చేసింది. సముద్రంలో నిఘా మరింత పెంచాలని, కోస్తా తీరంలో పహారా ముమ్మరం చేయాలని పేర్కొంది. కోస్టల్ గార్డులు, సెక్యూరిటీ వ్యవస్థను అప్రమత్తం చేయాలని, సముద్ర మార్గాల్లో రాకపోకలపై డేగకన్ను వేయాలని ఆదేశించింది.
యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన 26/11 మారణహోమం సృష్టించిన ఉగ్రవాదులు సముద్ర మార్గం ద్వారానే ముంబైకి చేరిన విషయం తెలిసిందే. 2008 నవంబర్ 26వ తేదీన ముంబైపై లష్కరే తొయిబా ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఈ దాడుల్లో 166 మంది మరణించారు. వందలాది మంది గాయపడ్డారు.
తాజ్‌మహల్ హోటల్, ఓబెరాయ్ ట్రైడెంట్ హోటల్, కామా ఆసుపత్రి, ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్, నారీమన్ హౌస్, మెట్రో సినిమా, లెపార్డ్ కేఫ్..వంటి ప్రాంతాలపై ఉగ్రవాదులు జరిపిన దాడులు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేశాయి. ఏకే 47 రైఫిళ్లు, ఆర్డీఎక్స్, ఐఈడీ, గ్రెనేడ్లు.. ఇలా మారణాయుధాలతో నరమేధాన్ని సృష్టించారు.












Click it and Unblock the Notifications