కోడింగ్ రాకున్నా సరే ఏఐతో అదిరిపోయే ప్యాకేజీలు.. లక్షల్లోనే జీతాలు!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) నేడు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ మార్కెట్‌ను శరవేగంగా మార్చేస్తోంది. నిన్నటి వరకు ఏఐ అంటే కేవలం కోడింగ్, ప్రోగ్రామింగ్ నైపుణ్యాలు తెలిసిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకుమాత్రమే పరిమితమైన రంగమనే ప్రచారం బలంగా ఉండేది. అయితే కాలంతో పాటు వస్తున్న పెను మార్పులు ఈ అంచనాలను తలకిందులు చేస్తున్నాయి. సాంకేతిక రంగానికి సుదూరంగా ఉండే సాధారణ అభ్యర్థులు సైతం ఇప్పుడు తమ కెరీర్‌కు ఏఐ రెక్కలు తొడుగుతున్నారు.
ప్రముఖ ఎడ్‌టెక్ విద్యా సంస్థ 'స్కేలర్’ తాజా అధ్యయనం
ప్రస్తుతం దేశంలో ఏఐ నైపుణ్యాల అవసరం ఏ స్థాయిలో ఉందో వివరిస్తూ ప్రముఖ ఎడ్‌టెక్ విద్యా సంస్థ 'స్కేలర్’ జూన్ 18, 2026న ఒక తాజా అధ్యయనాన్ని విడుదల చేసింది. ఈ పరిశోధనా నివేదికలోని ముఖ్యాంశాలు ఉద్యోగార్థులను ఎంతగానో ఆశ్చర్యపరుస్తున్నాయి. మార్కెట్లో పుడుతున్న మొత్తం ఏఐ ఆధారిత ఉద్యోగాలలో సగానికి పైగా పోస్టులకు కోడింగ్ లేదా కోర్ ఇంజనీరింగ్ విభాగాలతో ప్రత్యక్ష సంబంధం లేకపోవడం గమనార్హం.

నాన్-టెక్ ప్రొఫెషనల్స్ కూడా ఏఐ నైపుణ్యాలపై ప్రత్యేక శ్రద్ధ
ఐటీ రంగ నేపథ్యం లేకపోయినా ఏఐ అందించే విశేష అవకాశాలతో తమ వృత్తిపరమైన ప్రస్థానాన్ని సరికొత్తగా మలచుకునే వీలుందని ఈ నివేదిక వెల్లడించింది. దీనివల్ల వివిధ నాన్-టెక్ ప్రొఫెషనల్స్ కూడా ఏఐ నైపుణ్యాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ప్రారంభించారు. ఫలితంగా విభిన్న రంగాల్లో ప్రొడక్టివిటీ పెరగడంతో పాటు వ్యాపార ప్రక్రియలు మునుపెన్నడూ లేని విధంగా అత్యంత సులభతరంగా మారి స్థిరమైన పురోగతిని నమోదు చేస్తున్నాయి.
ఏఐ నేర్చుకుంటున్న వారికి లీడర్ షిప్ రోల్స్
కంపెనీలు ఏఐ ఆధారిత మానవ వనరుల వినియోగం వైపు అడుగులు వేస్తున్నాయి.స్కేలర్ లెర్నింగ్ విభాగం అందించిన తాజా డేటా ప్రకారం, ప్రస్తుతం ఏఐ కోర్సులు అభ్యసిస్తున్న ప్రతి నలుగురిలో ఒకరు సాంకేతికేతర (నాన్-టెక్) విద్యా నేపథ్యం నుంచి వచ్చినవారే కావడం గమనార్హం. ఏఐ కోర్సులను నేర్చుకుంటున్న వారిలో ప్రతి నలుగురిలో ఒకరు అతి తక్కువ కాలంలోనే ఆయా కంపెనీల్లో ఉన్నత స్థాయి లీడర్‌షిప్ రోల్స్ కు చేరుకుంటున్నారు.
ఏఐతో రూ. 33 లక్షల వార్షిక ప్యాకేజీలు
ఇది కార్పొరేట్ ఉద్యోగుల కెరీర్ వృద్ధి గ్రాఫ్‌ను పైకి తీసుకెళ్తోంది.కంపెనీల్లో ఇంజనీరింగ్ మరియు సాంకేతిక నాయకత్వ పాత్రల్లో సేవలందిస్తున్న వారికి సగటున రూ. 33 లక్షల రూపాయల వార్షిక ప్యాకేజీ అందుతోంది. దీనితో పాటు డేటా సైన్స్ రంగానికి ఆధిపత్యం వహిస్తున్న లీడర్లకు రూ.27 లక్షల వేతనం లభిస్తుండగా, కోడింగ్ అవసరం లేని కన్సల్టింగ్ వంటి ఉద్యోగాలలో కూడా సగటు ప్యాకేజీ రూ. 20 లక్షల వరకు నమోదు కావడం విశేషం.
వారికి ఏకంగా 155 శాతం వరకు వేతన వృద్ధి
నైపుణ్యం కలిగిన నిపుణుల అనుభవం కూడా జీతాల పెంపుదలపై గరిష్ట ప్రభావం చూపిస్తోంది. ఏఐ నైపుణ్యాలు కలిగిన 0 నుంచి 3 సంవత్సరాల అనుభవం ఉన్న తక్కువ వయస్సు గల యువ నిపుణులకు పాత జీతాల కంటే సగటున 147 శాతం అదనపు పెంపు లభిస్తోంది. ఒక ఆకర్షణీయమైన కెరీర్ వైపు అడుగులు వేస్తున్న 6 నుంచి 9 సంవత్సరాల అనుభవజ్ఞులు ఏకంగా 155 శాతం వరకు అత్యున్నత వార్షిక వేతన వృద్ధిని అందుకుంటున్నారు.












Click it and Unblock the Notifications