'వేదనిలయంలో పన్నీర్ శశికళ కాళ్లు పట్టుకున్నారు.. అతనో ద్రోహి'
జయలలిత మరణానంతరం వేదనిలయంకు వచ్చిన పన్నీర్ సెల్వం శశికళ మేడమ్ కాళ్లు పట్టుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
చెన్నై: తమిళ దివంగత సీఎం జయలలిత మరణానంతరం అనేకానేక మలుపులు తిరిగిన అన్నాడీఎంకె రాజకీయాలు చివరాఖరికి పళనిస్వామికి పట్టం కట్టేదాకా వచ్చాయి.పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ జైల్లో ఉండగా.. సీఎం పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న పన్నీర్ సెల్వం నిరాశలో మునిగిపోయారు.
ఈ నేపథ్యంలో అన్నాడీఎంకె అధికార ప్రతినిధి అప్సరారెడ్డి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. జయలలిత మరణానంతరం శశికళ సీఎం కావాలనుకుంటే.. అప్పుడే అయి ఉండేవారన్నారు. కానీ శశికళకు పదవీకాంక్ష లేదని పేర్కొన్నారు. అదే సమయంలో జయలలిత మరణం తర్వాత చోటు చేసుకున్న ఓ సంఘటన గురించి వివరించారు.

జయలలిత మరణానంతరం వేదనిలయంకు వచ్చిన పన్నీర్ సెల్వం శశికళ మేడమ్ కాళ్లు పట్టుకున్నారని అప్సరా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధ్యక్ష పదవి, సీఎం పదవి చేపట్టి పార్టీని కాపాడాలని పన్నీర్ శశికళను కోరారని చెప్పారు. ఇదంతా జరుగుతున్న సమయంలో తాను అక్కడే ఉన్నానని తెలిపారు.
అయితే ఆ తర్వాత ఏమైందో ఏమో గానీ డీఎంకె మాటలు విని పన్నీర్ ఎదురు తిరిగారని అభిప్రాయపడ్డారు. పార్టీపై తిరుగుబాటు చేసిన ద్రోహులు శిక్ష అనుభవించాల్సిందేనని అన్నారు. పన్నీర్ లాంటి నేతలు లేకపోయినంత మాత్రాన పార్టీకి వచ్చిన నష్టమేమి లేదన్నారు.












Click it and Unblock the Notifications