రూమర్స్‌కు చెక్: ‘మై సీఎం ఈజ్ ఫైన్’ కంపెయిన్ షురూ!
చెన్నై: తీవ్ర అనారోగ్య కారణంగా గత 18రోజుల నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితపై వస్తున్న వదంతులకు అడ్డుకట్ట వేయాలని అన్నాడీఎంకే పార్టీ భావించింది. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ ఐటీ విభాగం నేతలు 'ఆల్ ఈజ్ వెల్ అమ్మ', 'మై సీఎం ఈజ్ ఫైన్' పేరుతో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
అమ్మ మద్దతుదారులందరూ 'మై సీఎం ఈజ్ ఫైన్' అని జయలలిత ఉన్న ఫొటోను సామాజిక మాధ్యమాల్లో ప్రొఫైల్ పిక్చర్‌గా పెట్టుకోవాలని సూచించారు. అమ్మ ఆరోగ్యంపై వస్తున్న వదంతులకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఏఐఏడీఎంకే పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

ఇప్పటికే అమ్మ ఆరోగ్యంపై వదంతులు సృష్టిస్తున్న వారిపై ఆ పార్టీ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జ్వరం, డీ హైడ్రేషన్‌తో బాధపడుతున్న ఆమెను సెప్టెంబర్ 22న చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేర్పించిన విషయం తెలిసిందే.
కాగా, ప్రస్తుతం ఆమె పరిస్థితి మెరుగుపడిందని, కోలుకుంటున్నారని అపోలో వైద్యులు ఎప్పటికప్పుడు హెల్త్ బులిటెన్‌లు విడుదల చేస్తున్నారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో పాటు పలువురు ప్రముఖులు ఆస్పత్రికి వెళ్లి జయలలితను పరామర్శించారు. అనంతరం ఆమె కోలుకుంటున్నారని చెప్పారు.












Click it and Unblock the Notifications