తల్లి గర్భంలో ఉన్న 25 వారాల పిండానికి ఓపెన్ ఫీటల్ సర్జరీ- ఎయిమ్స్ ఘనత: భారత్ లో మొదటిసారి
ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డాక్టర్లు ఓ నూతన చరిత్ర సృష్టించారు. గర్భంలో ఉన్న 25 వారాల పిండానికి అత్యంత సంక్లిష్టమైన ఓపెన్ ఫీటల్ సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. ఆ పిండం వెన్నెముకకు సంబంధించిన సర్జరీ ఇది. వెన్నెముకలో తలెత్తిన లోపాన్ని ఈ శాస్త్ర చికిత్స ద్వారా సరిదిద్దారు. తల్లి కడుపులోనే ఉన్న శిశువుకు ఇటువంటి ఆపరేషన్ నిర్వహించడం ఇదే మొదటిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ అరుదైన సర్జరీ ద్వారా వైద్య రంగంలో భారత్ మరో అడుగు ముందుకు వేసినట్టయింది. ఈ నెల నవంబర్ 12వ తేదీన ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు ఎయిమ్స్ శనివారం అధికారికంగా ప్రకటించింది. గర్భంలో పిండం ఎదుగుతున్న క్రమంలో వెన్నుపాము నాడీ వ్యవస్థ మరింత దెబ్బతినకుండా కాపాడటమే ఈ చికిత్స ప్రధాన ఉద్దేశం. శిశువుకు వచ్చిన లంబోసేక్రల్ మైలోమెనింగోసీల్ అనే స్పైనా బైఫిడా లోపాన్ని సరిచేయడానికి డాక్టర్ల బృందం సుమారు ఆరు గంటల పాటు శ్రమించి ఈ సంక్లిష్టమైన శస్త్రచికిత్సను పూర్తి చేసింది.

ఈ ఆపరేషన్ కోసం ఎయిమ్స్ డాక్టర్లు అయిదు వారాల పాటు ముందస్తు ప్రణాళికలను రూపొందించుకున్నారు. ఫీటల్ ఇమేజింగ్ పరీక్షలు నిర్వహించడం, తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం, అనస్థీషియా ఏర్పాట్లు చేయడం, ఆపరేటివ్ సిమ్యులేషన్లను ప్రాక్టీస్ చేయడం.. వంటి కార్యక్రమాలను నిర్వహించారు. సర్జరీ సమయంలో తల్లికి గానీ, పిండానికి గానీ ఎలాంటి ప్రమాదం జరగకుండా అన్ని రకాల ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు.
ఈ శస్త్రచికిత్సలో వివిధ విభాగాలకు చెందిన 30 మందికి పైగా డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు. ఇందులో ఆబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ, మెటర్నల్- ఫీటల్, న్యూరోసర్జరీ, అనస్థీషియా, రేడియో డయాగ్నసిస్, ప్లాస్టిక్ సర్జరీ, నియోనాటాలజీ నిపుణులు భాగస్వామ్యులు అయ్యారు. న్యూరోసర్జరీ విభాగ ప్రక్రియకు డాక్టర్ దీపక్ గుప్తా నాయకత్వం వహించారు. మెటర్నల్- ఫీటల్ టీమ్ కు డాక్టర్ నీనా మల్హోత్రా, డాక్టర్ కే అపర్ణ శర్మ నేతృత్వం వహించారు.
ఓపెన్ ఫీటల్ సర్జరీ అనేది అత్యంత అరుదైన, సంక్లిష్టమైన ప్రక్రియ. ఈ విధానంలో తల్లి పొత్తికడుపు, గర్భాశయాన్ని శాస్త్రీయ పద్ధతిలో తెరచి, లోపల ఉన్న పిండానికి శస్త్రచికిత్స చేస్తారు. ఆ తర్వాత గర్భాశయాన్ని తిరిగి భద్రంగా కుడతారు. 25 వారాల పిండం పరిమాణం చాలా చిన్నదిగా ఉండటం, కచ్చితమైన నైపుణ్యంతో వెన్నెముక లోపాన్ని సరిదిద్దడం డాక్టర్లకు సవాల్. ఎయిమ్స్ డాక్టర్లు దీన్ని విజయవంతంగా అధిగమించారు.
సాధారణంగా స్పైనా బైఫిడా వంటి లోపాలు ఉన్న శిశువులకు వారు జన్మించిన తర్వాతే సర్జరీ చేస్తారు. పుట్టిన తర్వాత చేసే చికిత్సల కంటే తల్లి గర్భంలోనే చేసే ఓపెన్ ఫీటల్ సర్జరీ వల్ల ప్రయోజనం ఉంటుందని డాక్టర్లు స్పష్టం చేస్తోన్నారు. వెన్నెముక బహిర్గతం కావడం వల్ల నాడీ వ్యవస్థపై పడే ప్రతికూల ప్రభావాన్ని గర్భంలోనే నిరోధించవచ్చు. దీనివల్ల భవిష్యత్తులో నడవలేకపోవడం, మూత్ర విసర్జన నియంత్రణ కోల్పోవడం వంటి వైకల్యాల ప్రమాదం తగ్గుతుంది.












Click it and Unblock the Notifications
