సర్వం సిద్ధం- ఒక్క మాట కోసం: ప్రధాని మోదీతో వాయుసేన చీఫ్ భేటీ
Air Chief Marshan AP Singh: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్‌లో ఉగ్రవాదుల కిరాతక దాడి తరువాత అనూహ్య పరిణామలు ఏర్పడుతున్నాయి. ఈ దాడికి ప్రతీకారంగా కేంద్ర ప్రభుత్వం పలు నిర్ణయాలను తీసుకుంది. ఈ మారణహోమానికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులే కారణం కావడం వల్ల ఆ దేశంపై కఠిన ఆంక్షలకు దిగింది.
ఫలితంగా రెండ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. రెండు దేశాలు కూడా కాలు దువ్వుకుంటోన్నాయి. యుద్ధ సన్నాహాలు సైతం చేపట్టాయి. త్రివిధ దళాలు పూర్తిగా యాక్టివేట్ అయ్యాయి. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి సంసిద్ధంగా ఉన్నాయి.

ఈ పరిస్థితు మధ్య వైమానిక దళం చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం అయ్యారు. దేశ రాజధానిలో గల ప్రధాని అధికారిక నివాసం నంబర్ 7, లోక్ కల్యాణ్ మార్గ్‌లో ఈ భేటీ ఏర్పాటైంది. దాదాపుగా గంటకు పైగా ఈ సమావేశం కొనసాగింది. ఈ సందర్భంగా పలు అంశాలు వారి మధ్య ప్రస్తావనకు వచ్చాయి.
వైమానికంతో పాటు త్రివిధ దళాధిపతులతో మోదీ అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించడం ఈ వారం రోజుల వ్యవధిలో ఇది రెండోసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కిందటి నెల 29వ తేదీన ఇదే నంబర్ 7, లోక్ కల్యాణ్ మార్గ్ నివాసంలో జరిగిన భేటీలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ పాల్గొన్నారు.
త్రివిధ దళాధిపతులు ఉపేంద్ర ద్వివేది (ఆర్మీ), అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి (నేవీ), అమర్ ప్రీత్ సింగ్ (వైమానిక దళం)తో ప్రధాని మోదీ పలు కీలక అంశాలపై చర్చించారు. యుద్ధానికి దిగాల్సి వస్తే ఎలాంటి పరిణామాలు తలెత్తుతాయనే అంశం ఆరా తీసినట్లు చెబుతున్నారు. జమ్మూ కాశ్మీర్ వద్ద సరిహద్దు చొరబాట్లను నిరోధించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు సాగించారు.
పఠాన్ కోట్, హిండన్, యలహంక, అంబాలా, మహారాజ‌్‌పూర్, తేజ్‌పూర్ వంటి ఎయిర్ బేస్ వివరాల గురించి ఈ సందర్భంగా మోదీ వారిని అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ఉగ్రవాదాన్ని అణిచివేయడమే తమ సంకల్పమని మోదీ తేల్చి చెప్పినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
సాయుధ దళాల సామర్థ్యాలపై ఆయన పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారని పేర్కొన్నాయి. నిర్ణయాలను తీసుకోవడంలో త్రివిధ దళాధిపతులకు మోదీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని, అది ఎలాంటిదైనా ప్రభుత్వం తరఫున సంపూర్ణ సహకారం ఉంటుందనే విషయాన్ని స్పష్టం చేశారని వివరించాయి.












Click it and Unblock the Notifications