జాతీయ భద్రతా సలహారుగా మూడోసారి అజిత్ దోవల్ నియామకం
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశ భద్రత అంశానికి సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రతా సలహాదారు(NSA)గా అజిత్ దోవల్‌ను తిరిగి నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. వరుసగా మూడోసారి దోవల్‌ను ఎన్ఎస్ఏగా కేంద్రం నియమించింది.
అంతేగాక, అజిత్ దోవల్‌కు కేబినెట్ మంత్రి హోదా ఉంటుందని స్పష్టం చేసింది. ఎన్ఎస్ఏగా ఆయన నియామకానికి కేబినెట్ నియామకాల కమిటీ ఆమోద ముద్ర వేసింది. ఇక ప్రధాని మోడీ ముఖ్య కార్యదర్శిగా విశ్రాంత ఐఏఎస్ అధికారి పీకే మిశ్రాను మళ్లీ నియమించారు. ఈ మేరకు మిశ్ర పునర్నియామకాన్ని కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదించింది. వీరిద్దరి పదవీకాలం ప్రధాని పదవీకాలంతో సమానంగా ఉంటుందని లేదా తదుపరి ఆదేశాల వరకు కొనసాగుతారని ప్రభుత్వం పేర్కొంది.

ఇదే సమయంలో ప్రధానమంత్రి సలహాదారులుగా అమిత్ ఖరే, తరుణ్ కపూర్‌ను రెండేళ్ల కాలానికి కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వ కార్యదర్శి హోదా వీరికి ఉంటుందని ఆదేశాల్లో పేర్కొంది. జూన్ 10 నుంచే వీరందరి నియామకం అమల్లోకి వస్తుందని కేంద్రం వెల్లడించింది. కాగా, మోడీ సారథ్యంలోని ఎన్డీఏ తొలిసారి అధికారంలోకి వచ్చిన 2014 మే 30న అజిత్ దోవల్ తొలిసారి ఎన్ఎస్ఏగా బాధ్యతలు స్వీకరించారు.
అంతకుముందు ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్‌గాపనిచేశారు. ఉత్తరాఖండ్ (నాటి ఉత్తరప్రదేశ్)లో 1945లో దోవల్ జన్మించారు. 1968 బ్యాచ్ కేరళ కేడర్ ఐపీఎస్ అధికారిగా వృత్తి జీవితం ప్రారంభించారు. 2005లో ఐబీ డైరెక్టర్‌గా పదవీ విరమణ పొందారు. 2014లో మోడీ ప్రభుత్వంలో ఐదో జాతీయ భద్రతా సలహాదారుగా నియమితులయ్యారు.2016లో పీవోకేలో భారత్ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్, 2019లో బాలాకోట్ వైమానిక దాడుల్లో కీలకంగా వ్యవహరించారు.












Click it and Unblock the Notifications