ఇస్లాంలో హిజాబ్ అత్యవసరం కాదు.. అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు!
విద్యార్థుల్లో క్రమశిక్షణ, సమభావం, సంస్థాగత గుర్తింపును పెంపొందించడంలో స్కూల్ యూనిఫాం కీలక పాత్ర పోషిస్తుందని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. స్కూలులో నిర్దేశించిన యూనిఫాంతో పాటు హిజాబ్(తల స్కార్ఫ్) ధరించేందుకు అనుమతించాలంటూ ప్రయాగ్ రాజ్‌కు చెందిన సుకైనా రిజ్వీ అనే విద్యార్థిని దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ ధర్మాసనం ఇటీవల కీలక తీర్పు ఇచ్చింది. ఇస్లాంలో హిజాబ్ ధరించడం అత్యవసరమైన మతపరమైన ఆచారమని నిరూపించేందుకు ఎలాంటి వాస్తవ, చట్టపరమైన ఆధారాలను తమ ముందు ఉంచలేదని న్యాయస్థానం స్పష్టం చేసింది.
ప్రయాగ్ రాజ్‌లోని అతర్సుయియా ప్రాంతంలో ఉన్న టాగోర్ పబ్లిక్ స్కూల్ లో పదోతరగతి వరకు చదివిన విద్యార్థిని సుకైనా రిజ్వీ.. 11వ తరగతి ప్రవేశం సమయంలో పాఠశాల డ్రెస్ కోడ్‌తో పాటు హిజాబ్(హెడ్ స్కార్ఫ్) ధరించేందుకు అనుమతి కోరింది. గతంలో తాము దీనిని ధరించామని.. హిజాబ్ ధరించడం ఇస్లాంలో ఆవశ్యక మతపరమైన ఆచారమని పిటిషనర్ వాదించారు. దీనిని నిరాకరించడం రాజ్యాంగ కల్పించిన సమానత్వపు హక్కు, స్వేచ్ఛా ప్రకటన హక్కు ఉల్లంఘన కిందకు వస్తుందని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ క్రమంలో హిజాబ్ ధరించేందుకు అనుమతించేలా స్కూల్ యాజమాన్యాన్ని ఆదేశించాలని పిటిషనర్ న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.

స్పందించిన పాఠశాల యాజమాన్యం
పాఠశాల ప్రైవేట్, స్వయం సహాయక సీబీఎస్ఈ గుర్తింపు పొందిన సంస్థ అని, అందరూ సమానంగా పాటించేలా స్పష్టమైన యూనిఫాం విధానం పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు ప్రాతిపదిక అని స్కూల్ యాజమాన్యం పేర్కొంది. ఇతర ముస్లిం బాలికలు కూడా నిర్దేశత యూనిఫాం పాటిస్తున్నారని.. ఒక్కరికి మినహాయింపు ఇస్తే విద్యా సంస్థల క్రమశిక్షణ దెబ్బతింటుందని న్యాయస్థానానికి వెల్లడించింది.
ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ జేజే మునీర్, జస్టిస్ ఇంద్రజీత్ శుక్లాతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇంతకు ముందు తరగతులలో యాజమాన్యం అభ్యంతరం చెప్పనంత మాత్రాన విద్యార్థికి భవిష్యత్తులో కూడా దాన్ని పాటించే చట్టపరమైన హక్కు సంక్రమించదని పేర్కొంది. పాఠశాల ఆవరణలో విద్యార్థుల మధ్య ఎటువంటి వైరుధ్యాలు, భేదభావాలు లేకుండా ఒకే రకమైన తటస్థ వాతావరణాన్ని ప్రోత్సహించేందుకు యూనిఫాం తోడ్పడుతుందని స్పష్టం చేసింది. తరగతి గదిలో హిజాబ్ ధరించడమనేది ఇస్లాం మత విశ్వాసానికి తప్పనిసరి అని నిరూపించే తగిన ఆధారాలను పిటిషనర్ సమర్పించుకోలేకపోయానని ధర్మాసనం నిర్ధారించింది. గతం ఇచ్చిన తీర్పులను న్యాయమూర్తులు ఉదహరించారు. వ్యక్తిగత కారణాలతో యూనిఫాంను మార్చుకునే వెసులుబాటు ఇస్తే అది యూనిఫాం అనే ప్రాథమిక భావనకే విఘాతం కలిగిస్తుందని కోర్టు తుది తీర్పు ఇచ్చింది.














Click it and Unblock the Notifications