నేను వీఐపీని అందుకే: షూ తొడిగించుకున్న మంత్రి
హైదరాబాద్: తన సాండిల్స్‌ను సెక్యూరిటీ అధికారితో తొడిగించుకున్న ఒడిశా మంత్రి పైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి ఆయన ఇచ్చిన సమాధానం కూడా మరింత ఆగ్రహానికి గురయింది. తాను వీఐపీని కాబట్టి తన షూ తొడిగాడని సదరు మంత్రి చెప్పడం గమనార్హం.
ఒడిశాలో అధికార బిజు జనతా దళ్ పార్టీకి చెందిన మంత్రి జోగేంద్ర బెహెరా సోమవారం కియొంజహార్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆ మంత్రి కాళ్లకు ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది శాండిల్స్ తొడిగారు.

ఇది కెమెరాకు చిక్కింది. మంత్రి వ్యక్తిగత సిబ్బందితో షూ తొడిగించుకున్నారని పెద్ద ఎత్తున స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై ఆ మంత్రి స్పందించారు. తన పనిని సమర్థించుకున్నారు. తాను ప్రముఖ వ్యక్తిని అని, కాబట్టే తొడిగారని చెప్పారు. సోషల్ మీడియాలో ఈ ఫొటో వైరల్ అవడంతో బెహెరాపై విమర్శలు వస్తున్నాయి. దీనిపై ఒడిశా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications