Amazon Prime Video : ఓటీటీ యూజర్లకు అమెజాన్ ప్రైమ్ షాక్- 50 శాతం పెరిగిన సబ్ స్కిప్షన్
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ ఇవాళ యూజర్లకు భారీ షాకిచ్చింది. ఓటీటీ ప్రారంభించిన తర్వాత ఇప్పటివరకూ ధరలు పెంచని అమెజాన్ తొలిసారి భారీగా ధరలు పెంచేసింది. ఏడాది ప్యాక్ తో పాటు మూడు నెలలు, నెల వారీ ప్యాక్ ల ధరల్ని కూడా సవరిస్తూ తాజాగా ప్రకటన చేసింది. దీంతో ఇప్పటివరకూ పాత ధరలతో అమెజాన్ ప్రైమ్ ను వాడుతున్న యూజర్లకు షాక్ తగిలినట్లయింది.
భారత్ లో అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్ స్క్రిప్షన్ ధరల్ని 50 శాతం పెంచుతున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. అలాగే పెరిగిన ధరల వివరాల్ని కూడా ఓ ప్రకటనలో వెల్లడించారు. తాజా మార్పుల ప్రకారం అమెజాన్ ప్రైమ్ వీడియో వార్షిక ప్యాక్ రూ.999 నుంచి రూ.1499కి పెరిగింది. అలాగే మూడు నెలల ప్యాక్ ధర రూ.329 నుంచి రూ.459కి పెరిగింది. అలాగే నెలవారీ ప్యాక్ ధర రూ.129 నుంచి రూ.179కి పెంచుతూ అమెజాన్ నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటికే సబ్ స్కైబ్ చేసుకున్న వారికి మాత్రం పాత ధరలే వర్తించబోతున్నాయి.

కొత్తగా అమెజాన్ ప్రైమ్ వీడియోకు సబ్ స్కైబ్ చేయాలంటే మాత్రం కొత్త ధరలు వర్తించబోతున్నాయి. అయితే ఈ మార్పుల్ని ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకొస్తారన్న దానిపై మాత్రం అమెజాన్ ప్రస్తుతానికి క్లారిటీ ఇవ్వలేదు. త్వరలో దీనిపై ఓ ప్రకటన చేసే అవకాశముంది. ఇప్పటికైతే పాత ధరలే కొనసాగనున్నాయి. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా లక్షల సంఖ్యలో వీడియోలు, షోలు, సినిమాలు, మ్యూజిక్ కూడా అందుబాటులో ఉన్నాయి. పది భాషల్లో అమెజాన్ ప్రైమ్ ప్రస్తుతం వీడియోల్ని అందుబాటులో ఉంచుతోంది.
కరోనా నేపథ్యంలో ఓటీటీలకు ఆదరణ బాగా పెరిగింది. భారత్ లో అయితే ధియేటర్లు మూతపడటం వల్ల భారీ మార్కెట్ కలిగిన నగరాల్లో ఓటీటీల కోసం జనం ఎగబడుతున్నారు. ఇంటి వద్దే ఉంటూ సరికొత్త వీడియోలను ఎప్పటికప్పుడు వీక్షించే అవకాశం లభించడంతో ధియేటర్లకు ఆదరణ అంతకంతకూ తగ్గిపోతోంది. దీంతో ఈ మార్కెట్ ను క్యాష్ చేసుకునేందుకు అమెజాన్ ప్రైమ్ ఏకంగా 50 శాతం ధరలను పెంచేసింది. ఇప్పటికే డిస్నీ-హాట్ స్టార్ వంటి ప్లాట్ ఫామ్స్ ధరలను పెంచగా.. ఇప్పుడు అమెజాన్ అదేబాటలో పయనించింది. దీంతో మిగతా ప్లాట్ ఫామ్స్ కూడా ధరల పెంపుపై దృష్టిసారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఓటీటీ యూజర్లకు ధరల మంట తగలడం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications