అమెజాన్ అద్భుతం: మీ ఇంటి ముంగిటే... పారాచూట్ తో హోం డెలివరీ
ఇప్పటికే డ్రోన్లతో డెలివరీ సేవలను ప్రారంభించిన అమెజాన్ ఇక మీదట పారాచూట్ లను కూడా వినియోగించనుంది.
ముంబై: మీరు అమెజాన్ లో ఏదైనా వస్తువు ఆర్డర్ చేశారా? డెలివరీ టైం దగ్గర పడిందని కొరియర్ బాయ్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీరు ఆర్డర్ చేసిన వస్తువును ఈసారి కొరియర్ బాయ్ తీసుకురాడు.
అప్పుడప్పడు ఆకాశంలోకి చూస్తూ ఉండండి. గాల్లో తేలుకుంటూ మీ ఇంటి వైపు ఒక పారాచూట్ రావడం కనిపిస్తుంది. దానికి ఓ డబ్బా వేలాడుతూ ఉంటుంది. అది మీదే. కాస్త ఓపిక పడితే ఆ పారాచూట్ అలా తేలుకుంటూ వచ్చి మీ ఇంటి ముంగిట వాలుతుంది.
ఇది కథ కాదు.. మీరు చదివింది నిజమే. హోం డెలివరీకి సంబంధించి అమెజాన్ తీసుకొచ్చిన సరికొత్త సదుపాయం ఇది. ఇప్పటికే డ్రోన్లతో డెలివరీ సేవలను ప్రారంభించిన అమెజాన్ ఇక మీదట పారాచూట్ లను కూడా వినియోగించనుంది.

గగనతలం నుంచి కస్టమర్ల ఇంటి గుమ్మం ముందు పార్శిళ్లను నేరుగా దించేందుకు అమెజాన్ ఈ పారాచూట్ డెలివరీ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అమెజాన్ 'డ్రోన్ డెలివరీ' విధానంలో డ్రోన్ వినియోగదారుడి ఇంటి వద్ద ల్యాండ్ అవాల్సి ఉంటుంది.
అయితే డ్రోన్లు గగనతలంలో ప్రయాణించడం కంటే.. ల్యాండింగ్, టేకాఫ్ లకే ఎక్కువ ఇంధనం ఖర్చవుతోందట. దీంతోపాటు కొన్ని భద్రతాపరమైన సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందట. అందుకే పారాచూట్ డెలివరీ విధానాన్ని తీసుకొచ్చినట్లు అమెజాన్ పేర్కొంది.
ఈ పారాచూట్ లను కూడా డ్రోన్ లే తీసుకొస్తాయి. సరిగ్గ మీ ఇంటి వద్దకు వచ్చాక దాన్ని వదిలిపెడతాయి. అయితే కిందికి వదిలాక గాలి ప్రవాహానికి పారాచూట్ అటు ఇటు వెళ్లే ప్రమాదం ఉంటుంది.
ఈ సమస్యకు కూడా అమెజాన్ పరిష్కారం కనుగొంది. పారాచూట్ కిందికి దిగేంత వరకు డ్రోన్ అక్కడే గాలిలో ఎగురుతూ దీన్ని గమనిస్తుందట. ఒకవేళ పారాచూట్ గనుక గాలి వాటుకు పక్కకు కదిలితే ప్రత్యేకంగా సిగ్నళ్లతో దాన్ని సరైన చోట దిగేలా చేస్తుంది. ఇందుకు అనుగుణమైన ప్రత్యేక వ్యవస్థను ఈ డెలివరీ పారాచూట్ లలో పొందుపరిచారు.












Click it and Unblock the Notifications